భేటీకి హాజరుకాలేం.. స్పష్టం చేసిన తెలంగాణ

Telangana To Abstain Godavari Board Meeting On 9th August - Sakshi

కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ స్పష్టం

నేటి భేటీకి హాజరుకాలేమంటూ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ లేఖలు

మరో రోజున భేటీని ఏర్పాటు చేయాలంటూ వినతి 

తెలంగాణ అభ్యంతరాలతో బోర్డులకు లేఖలు రాయాలని సీఎం ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై చర్చించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన పూర్తి స్థాయి బోర్డు భేటీకి దూరంగా ఉండాలని తెలంగాణ నిర్ణయించింది. ఇదే రోజున సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ప్రాధాన్య కేసుల విచారణ ఉన్నందున.. ఈ భేటీలకు హాజరుకాలేమని ఇదివరకే తెలంగాణ స్పష్టం చేసింది. ఆదివారం కూడా బోర్డులకు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ మళ్లీ లేఖలు రాసింది. తెలంగాణ లేఖల నేపథ్యంలో సోమవారం నాటి బోర్డుల ఉమ్మడి భేటీ ఉంటుందా.. లేదా.. అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో బోర్డులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీకి సైతం రాలేమని తెలంగాణ చెప్పినా సమావేశం కొనసాగించాయి. ఇదే రీతిన బోర్డులు ముందుకు సాగుతాయా.. లేక తెలంగాణ వినతి నేపథ్యంలో వెనక్కి తగ్గుతాయా అన్నది ఉత్కంఠగా మారింది. 

ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు.. 
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గత నెల 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాలే అజెండాగా ఈనెల 9న భేటీ నిర్వహిస్తామని తెలుగు రాష్ట్రాలకు రెండు బోర్డులు 4న లేఖలు రాశాయి. అయితే దీనిపై తెలంగాణ వెంటనే స్పందించింది. అదే రోజు తమకు కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ ఉపసంహరణపై విచారణ, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ఎన్జీటీ ముందు విచారణకు రానుందని, ఈ నేపథ్యంలో భేటీలకు హాజరు కాలేమని తెలిపింది. అయినా పట్టించుకోని బోర్డులు, గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌ అవస్థీ రాసిన లేఖలను ప్రస్తావిస్తూ.. 30 రోజుల్లో నోటిఫికేషన్‌ అమలు చేసేలా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాల్సి ఉన్న దృష్ట్యా ఈ భేటీకి రావాలని లేఖలో కోరాయి.

అయితే ఈ లేఖల అంశాలతో పాటు, గెజిట్‌లోని ఇతర అంశాలపై శని, ఆదివారాల్లో సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇరిగేషన్‌ ఇంజనీర్లకు పలు అంశాలపై మార్గదర్శనం చేశారు. ఆయన సూచన మేరకు ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ ఆదివారం బోర్డులకు వేర్వేరుగా లేఖలు రాశారు. కోర్టు కేసుల విచారణ దృష్ట్యా 9న భేటీకి రాలేమని, అందరికీ ఆమోదమైన మరో రోజున భేటీ నిర్వహిస్తే రాష్ట్ర ఇంజనీర్లు హాజరై, వారి అభిప్రాయాలు వెల్లడిస్తారని లేఖల్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో పరిపాలన పరమైన అంశాలే కాకుండా, నీటి వినియోగానికి సంబంధించిన అంశాలను సైతం అజెండాలో చేర్చాలని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో కోరారు. అయితే దీనిపై బోర్డులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది సోమవారం ఉదయం వెల్లడి కానుంది. ఏపీ మాత్రం ఈ భేటీలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అజెండా పంపి.. వాటాలు రాబట్టాలి 
బోర్డుల భేటీ వాయిదా కోరుతున్న తెలంగాణ కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. రెండ్రోజుల పాటు వరుసగా దీనిపై చర్చించిన సీఎం బోర్డులకు సమగ్ర అజెండా అంశాలతో లేఖలు రాయాలని, వాటిని బోర్డుల్లో చర్చించేలా పట్టుబట్టాలని ఇంజనీర్లకు సూచించారు. దానికి అనుగుణంగా రావాల్సిన వాటాలు దక్కించుకోవాలని చెప్పారు. ముందుగా రాష్ట్రం లేవనెత్తుతున్న అంశాలను చర్చించేలా అజెండాతో బోర్డులకు లేఖలు రాయాలని సూచించినట్లుగా చెబుతున్నారు.

ముఖ్యంగా ఇంతవరకు కొనసాగుతున్న కృష్ణా జలాల్లో ఉన్న నీటి వాటాల నిష్పత్తిని మార్చి దాన్ని చెరిసగం పంచాలని, ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపేలా చర్యలతో పాటు, పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా తరలిస్తున్న నీటి తరలింపును అడ్డుకునేలా వాదనలు సిద్ధం చేయాలని చెప్పినట్లు సమాచారం. వీటితో పాటే బచావత్‌ అవార్డు ప్రకారం.. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటాపై గట్టిగా వాదనలు వినిపించాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాలకు వినియోగించే నీటిలో 20 శాతం వినియోగం మాత్రమే పరిగణనలోకి తీసుకునే అంశాలపై ఇదివరకే రాసిన లేఖలు, దీనిపై బోర్డులు, కేంద్రం స్పందించిన తీరు, చేపట్టిన చర్యలన్నింటినీపైనా బలమైన వాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనల నేపథ్యంలో ఆదివారం సైతం అంతర్రాష్ట్ర విభాగపు ఇంజనీర్లు తమ కసరత్తును కొనసాగించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top