నకిలీ పత్తి విత్తనాల కట్టడికి టాస్క్‌ఫోర్స్‌ | Task force to curb fake cotton seeds | Sakshi
Sakshi News home page

నకిలీ పత్తి విత్తనాల కట్టడికి టాస్క్‌ఫోర్స్‌

May 2 2025 4:09 AM | Updated on May 2 2025 4:09 AM

Task force to curb fake cotton seeds

రంగంలోకి దిగిన పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు10 మంది అరెస్టు

రూ.కోటిన్నరకు పైగా విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాదీనం 

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ పత్తి విత్తన ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రైతులు పత్తి సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి నాసిరకం విత్తన ముఠాల ఏజెంట్లు వస్తున్నారు. తక్కువ ధరను ఆశగా చూపి రైతులకు మొలకెత్తని, ఊరుపేరు లేని నాసిరకం విత్తనాలు అంటగట్టే ముఠాల పని పట్టేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేశారు. వ్యవసాయ, పోలీస్‌ అధికారులతో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు ఈ బృందాలతో తనిఖీలు ప్రారంభించారు. 

సీజన్‌ ఊపందుకోనున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. వరుసగా మూడుసార్ల కంటే ఎక్కువ పట్టుబడిన నిందితులపై పీడీ యాక్ట్‌లు సైతం నమోదు చేస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాలు ప్రధానంగా వస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత సరిహద్దుల్లోనూ నిఘా పెంచారు. మరోవైపు రైతుల్లోనూ నాసిరకం విత్తనాలు కొనుగోలు చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. 

విత్తన కొనుగోలు సమయంలో లేబుల్స్‌ సక్రమంగా ఉండేలా..అధికారి డీలర్‌ వద్ద నుంచే విత్తనాలు కొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నకిలీవి విక్రయించే అవకాశం ఉన్నట్టు బీజీ–3 పత్తి విత్తనాల అక్రమ రవాణాపై అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. 

ఇదీ టాస్క్‌ఫోర్స్‌ టీం  
నకిలీ విత్తనాలను గుర్తించడంతోపాటు విత్తన ముఠాలపై చర్యలకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ టీంలో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన సర్టిఫికేషన్‌ అధికారులు, సీడ్‌ కార్పొరేషన్‌ అధికారులు, పోలీసులు భాగస్వాములుగా ఉన్నారు.  

ఈ ఏడాది మే 1 వరకు నమోదైన కేసులు ఇలా... 
ఆదిలాబాద్‌ జిల్లా: మార్చి 3న మల్లిడి గ్రామంలో నకి లీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు గురిని అరెస్టు చేశారు. రూ.6.85 లక్షల విలువైన 2.74 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వా«దీనం చేసుకున్నారు. 
» మార్చి 9న సుర్జాపూర్‌లో రూ. 3.50 లక్షల విలువైన 1.40 క్వింటాళ్ల పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. 

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా: కర్ణాటక నుంచి మంచిర్యాలకు నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న రాకెట్‌ను మార్చి 19న శామీర్‌పేట్‌ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) ఛేదించింది. ట్రక్‌ డ్రైవర్‌ను అరెస్టు చేయడంతోపాటు, రూ.98.75 లక్షల విలువైన 3,750 కిలోల విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు.  

వికారాబాద్‌ జిల్లా: వికారాబాద్‌ జిల్లా టాస్‌్కఫోర్స్, కరణ్‌కోట్‌ పోలీసులు ఏప్రిల్‌ 12న రూ.44 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement