అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు: మంత్రి తలసాని

Talasani Srinivas Comments On Deccan Mall Fire Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రామ్‌గోపాల్‌పేట్‌లోని డెక్కన్‌ మాల్‌ భవనంలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కాగా, డెక్కన్‌ మాల్‌ అగ్ని ప్రమాదం నేపథ్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. డెక్కన్‌ మాల్‌ భవనంలో కెమికల్స్‌ వల్ల మంటలు ఆరలేదు. హైదరాబాద్‌లో డెక్కన్‌ మాల్‌ వంటి భవనాలు 25వేల వరకు ఉండొచ్చు. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు. ఇలాంటి కట్టడాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీ వేశాము. ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి గాలిమాటలు మాట్లాడుతున్నారు. భవనాల క్రమబద్దీకరణపై స్టే ఉందని కిషన్‌ రెడ్డికి తెలియదా?. గుజరాత్‌లో కూడా వంతెన కూలి 180 మంది మరణించారు. కిషన్ రెడ్డి లాగా మేము రాజకీయాలు చేశామా?. హైదరాబాద్ అభివృద్ధికి గత ఎనిమిదేళ్లలో 65 వేల కోట్ల రూపాయలు కేటాయించాము. ఇంత అభివృద్ధి గతంలో ఎపుడైనా జరిగిందా?. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదు. బాధితులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వ అధికారులా?. కిషన్ రెడ్డి భాద్యత లేకుండా మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.

మా ప్రభుత్వంలో ఒక్క భవనాన్ని కూడా రెగ్యులరైజ్‌ చేయలేదు. అగ్ని ప్రమాదం కారణంగా పక్కన ఉన్న బస్తీ వాసులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నాము. బాధితులను కాపాడే క్రమంలో అగ్ని మాపక సిబ్బంది​కి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కట్టడం నాణ్యతపై నిట్‌ ఆధ్వర్యంలోని కమిటీ తన నివేదికని త్వరలోనే సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top