MLC Kavitha-ED Investigation: హాజరుపై ఉత్కంఠ!

ఎమ్మెల్సీ కవితను నేడు విచారణకు రావాలన్న ఈడీ అధికారులు
స్వయంగా హాజరవుతారా?.. న్యాయవాదిని ప్రతినిధిగా పంపుతారా?
హాజరుకాకుంటే ఈడీ ఎలా స్పందిస్తుందనే దానిపై చర్చలు
ఎలాంటి పరిణామాలు జరగొచ్చన్న దానిపై బీఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్
24న సుప్రీంకోర్టులో విచారణ వరకు ఆగాలని కవిత యోచన!
కోర్టు ఏం చెప్తుందనే దాన్ని బట్టి ఈడీ ఎదుట హాజరవడంపై నిర్ణయం?
న్యాయ నిపుణుల సూచనలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశం
మంత్రి కేటీఆర్, భర్త అనిల్‌తో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న కవిత
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 16న జరగాల్సిన ఈడీ విచారణకు కవిత వెళ్లకపోవడం.. తన న్యాయవాది ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు పంపడం.. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌పై 24న విచారణ జరిగేదాకా ఈడీ విచారణ ఆపాలని అధికారులకు లేఖ రాయడం.. అయినా కూడా 20న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు ఇవ్వడం నేపథ్యంలో అన్నివర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
అంతేగాకుండా ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న కవిత విజ్ఞప్తిని.. చీఫ్ జస్టిస్ ధర్మాసనం తిరస్కరించడం హాట్ టాపిక్‌గా మారింది. కవిత ఈడీ విచారణకు హాజరైతే ఏం జరుగుతుంది? ఒకవేళ హాజరుకాకపోతే ఈడీ ఎలా స్పందిస్తుంది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది బీఆర్‌ఎస్ శ్రేణుల్లో మరింత టెన్షన్ రేపుతోంది. ఈ క్రమంలో సోమవారం కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేక మొన్నటిలా న్యాయవాదిని తన ప్రతినిధిగా పంపుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీకి చేరుకున్న కవిత
సోమవారం (20న) విచారణకు హాజరుకావాలన్న ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఆదివారం సాయంత్రమే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కవిత వెంట ఆమె భర్త అనిల్‌తోపాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, కొందరు సన్నిహిత అనుచరులు ఉన్నట్టు సమాచారం.
అధికారులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందే కవిత ఢిల్లీకి చేరుకున్నా.. విచారణకు హాజరయ్యే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. న్యాయ నిపుణుల సలహాలకు అనుగుణంగానే నడుచుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
ప్రతీసారి ఊహాగానాలతో..
ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత మూడో పర్యాయం ఢిల్లీకి చేరుకోగా.. ప్రతీసారి ఆమెను అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు, కేటీఆర్ సహా మంత్రులు, సన్నిహితులు వెంట రావడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
‘సుప్రీం’ నిర్ణయం తేలిన తర్వాతే..?
ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో.. సోమవారం కూడా కవిత తన న్యాయవాది లేదా ప్రతినిధి ద్వారా ఈడీకి సమాచారం పంపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
ఈడీ విచారణకు హాజరుకాని పక్షంలో ఎదురయ్యే పరిణామాలపైకవిత ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని.. నిబంధనల మేరకు విచారణ జరగడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అదే వాదనకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారని తెలిసింది.
సుప్రీం ఏం చెప్తుందనే అంశాన్ని చూశాకే ఈడీ ఎదుట హాజరవడంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో న్యాయ నిపుణులతో జరిగే సంప్రదింపుల్లో సహకరించేందుకే కవితతోపాటు మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మరిన్ని వార్తలు :