రోగులకు ఆ..‘పరేషాన్‌’ 

Surgeries stopped at King Koti and Gandhi Hospitals - Sakshi

కింగ్‌కోఠి, గాంధీల్లో సర్జరీలు నిల్‌ 

ఉస్మానియాలో 110 నుంచి 25కు తగ్గిన వైనం 

పాతభవనం ఖాళీ, ఆక్సిజన్‌ లేక నిలిచిన చికిత్సలు 

నిమ్స్‌లో అత్యవసర చికిత్సలు ఓకే..  

ఆందోళనలో రోగులు.. కార్పొరేట్‌ ఆస్పత్రులకు పరుగులు 

చేవెళ్లకు చెందిన సత్యనారాయణ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు రాడ్డు అమర్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత కాలులోని రాడ్డును తీసివేస్తామని చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్‌గా మార్చడంతో చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాడు. అత్యవసర సర్జరీలు మినహా ఎలక్టివ్‌ సర్జరీలన్నీ వాయిదా వేసినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో చేసేదేమీ లేక సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో రాడ్డు తొలగింపు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.  

బాలాపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి కొంతకాలంగా తీవ్రమైన గ్యాస్ట్రిక్‌ పెయిన్‌తో సతమతమవుతున్నాడు. చికిత్స కోసం నిమ్స్‌ వైద్యులను సంప్రదించగా ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, సంబంధిత విభాగం వైద్యులు క్వారంటైన్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన అనేక మంది బాధితులకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌:  గత ఏడాది ఇదే సమయంలో గాంధీ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 3,000 నుంచి 3,500 మంది రోగులు వచ్చేవారు.  రోజుకు సగటున 250 సర్జరీలు జరిగేవి. ఇటీవల ప్రభుత్వం ఈ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్‌గా మార్చడంతో సాధారణ రోగులకు చికిత్సలు అందడం లేదు. గాంధీ, కింగ్‌కోఠి, జిల్లా ఆస్పత్రుల్లో మేజర్, మైనర్‌ సర్జరీలు చేయించుకుని ఫాలో అప్‌ చికిత్సలు, మందుల కోసం వచ్చే రోగులు ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో పడిపోయారు.  నిమ్స్‌ సహా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు, ఆపరేషన్‌ థియేటర్ల కొరత ఉంది. అక్కడ అత్యవసర చికిత్సలు మినహా ఎలక్టివ్‌ చికిత్సలు చేయకపోవడంతో బాధితులు విధిలేని పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.  

కోవిడ్‌..  క్వారంటైన్‌ సెలవులు 
ఉస్మానియా ఆస్పత్రిలోని పాత భవనంలోకి ఇటీవల వర్షపునీరు చేరడంతో అక్కడి పడకలను ఖాళీ చేసి, కులీకుతుబ్‌షా, ఓపీ బ్లాక్‌లకు తరలించారు. ఆస్పత్రికి వస్తున్న అనేకమంది అసింప్టమేటిక్‌ కోవిడ్‌తో బాధపడుతున్నారు. వీరిని ముట్టుకోవడంతో వైద్యులు, టెక్నీషియన్లు, స్టాఫ్‌ నర్సులు కోవిడ్‌ బారిన పడుతున్నారు. ఇలా 212 మంది వైద్యులకు కోవిడ్‌ సోకింది. వైద్యుల్లో 60 శాతం మంది వి«ధుల్లో ఉంటే.. 40 శాతం మంది క్వారంటైన్‌ సెలవుల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు చేయించుకుంటుండగా... మరికొంత మంది తాత్కాలికంగా మందులపై నెట్టుకొస్తున్నారు. పాతభవనం ఖాళీ చేయడంతో ఆపరేషన్‌ థియేటర్ల సమస్య తలెత్తింది. పాతభవనంలోని రోగులకు ఇతర విభాగాల్లో సర్దుబాటు చేసినప్పటికీ పోస్టు ఆపరేటివ్‌ వార్డులకు ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడం, ఉన్న ఆపరేషన్‌ థియేటర్లు ఇతర చికిత్సలతో బిజీగా మారడంతో అత్యధిక రోగులకు చికిత్సలు అందడంలేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top