
నలుగురిని సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు,
వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ ఎంపిక
న్యాయవాదుల కోటా నుంచే వారికి అవకాశం
సిఫార్సులన్నీ ఆమోదం పొందితే 33కు చేరనున్న జడ్జీల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం వారి నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌తోపాటు జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలతలను తెలంగాణకు బదిలీ చేస్తూ గత నెల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ సుజోయ్‌పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. కొత్తగా ఎంపికైన వారు నలుగురు, బదిలీపై ఇక్కడికి వచ్చేవారు నలుగురు, ఇక్కడి నుంచి వెళ్లే వారు ఒకరు.. వీరందరి సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే న్యాయమూర్తుల సంఖ్య 33 (సీజేతో కలిపి)కు పెరగనుంది. ఇంకా 9 ఖాళీలుంటాయి. చాలాకాలం తర్వాత న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా పదోన్నతులు క ల్పించడంపట్ల అడ్వొకేట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జడ్జీల నేపథ్యాలు ఇవి..
⇒ సుద్దాల చలపతిరావు 1971 జూన్ 25న జనగాంలో జన్మించారు. తండ్రి జగన్‌మోహన్‌రావు. 1998 మార్చి 26న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. వై.రామారావు వద్ద 1998 నుంచి 2004 వరకు జూనియర్‌గా పనిచేశారు. 2004 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సిటి సివిల్ కోర్టులతోపాటు హైకోర్టులో సివిల్, క్రిమినల్ సహా అన్ని విభాగాల కేసుల్లో వాదనలు వినిపించారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సెల్‌గా 2022లో నియమితులయ్యారు. ప్రస్తుతం అవే విధులు నిర్వహిస్తున్నారు.
⇒ వాకిటి రామకృష్ణారెడ్డి 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు స్వగ్రామం. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. అన్న, చెల్లి ఉన్నారు. 1998లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఎ.అనంతసేన్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2005 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టుతోపాటు తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, ఫ్యామిలీ, కంపెనీ కేసుల్లో సమర్థులు. ఇప్పటివరకు 1,000 పిటిషన్లకుపైగా దాఖలు చేశారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈడీ స్టాండింగ్ కౌన్సెల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
⇒ గౌస్ మీరా మొహినుద్దీన్ 1969 జూలై 15న జన్మించారు. ఆయన హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన వారు. తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ హెచ్‌ఎంటీ మేనేజర్‌గా పనిచేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాల నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదివారు. 1993 మార్చి 17న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఉమ్మడి బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. సివిల్, రాజ్యాంగంతోపాటు పలు విభాగాల్లో సమర్థ వాదనలు వినిపించారు.
⇒ గాడి ప్రవీణ్‌కుమార్ 1971 ఆగస్టు 28న జన్మించారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్. తండ్రి జగన్‌మోహన్‌రావు. కాకతీయ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ.. ఓయూలో ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం చదివారు. 1998 నవంబర్ 12న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. హైకోర్టు, అడ్మిని్రస్టేటివ్, ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులో పలు కేసులు వాదించారు. రాజ్యాంగ, సర్విస్ మ్యాటర్స్, లేబర్ లా, క్రిమినల్ లా.. పలు విభాగాల్లో నిష్ణాతులు. ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.