హైకోర్టుకు 12 మంది జడ్జీలు!

Supreme Court Collegium Recommends 12 Judges To Telangana High Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులను నియమించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నెల 1న కొలీజియం సమావేశమై ఈ మేరకు చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. న్యాయవాదులు కాసోజు సురేందర్, చాడ విజయభాస్కరరెడ్డి, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌.. జ్యుడీషియల్‌ అధికారులు జి.అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్‌రెడ్డి, డి.నాగార్జునలను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది. 
పదికి పెరగనున్న మహిళా జడ్జీల సంఖ్య..
ప్రస్తుతం హైకోర్టులో ఆరుగురు మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తుండగా.. తాజా ఇద్దరు న్యాయవాదులు, మరో ఇద్దరు జిల్లా జడ్జిలకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన నేపథ్యంలో త్వరలో మహిళా జడ్జిల సంఖ్య 10కి చేరుకోనుంది.  

చాడ విజయభాస్కర్‌రెడ్డి..
1968, జూన్‌ 28న ఉమ్మడి మెదక్‌ జిల్లా దుబ్బాకలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1992, డిసెంబర్‌ 31న బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. జస్టిస్‌ వీవీఎస్‌ రావు దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1999లో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ), స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2006–09 మధ్య కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. 2010–15 మధ్య వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. 2014 నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. 

సూరేపల్లి నంద..
1969, ఏప్రిల్‌ 4న జన్మించారు. 1993లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. 28 ఏళ్లుగా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు బార్‌ కౌన్సిల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందిస్తున్నారు. 1995–2001 వరకు స్టేట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ప్యానల్‌ అడ్వొకేట్‌గా, 2001–04 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సేవలందించారు. 2005–2016 హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీ మెంబర్‌గా సేవలు అందించారు. న్యాయవాదిని పెట్టుకోలేని కక్షిదారులకు న్యాయ సహాయం అందించడంపై పలు జిల్లాల్లో న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. 

జువ్వాడి శ్రీదేవి..
1972, ఆగస్టు 10న జన్మించారు. 1997లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 2004–08 వరకు నిర్మల్‌ జిల్లా కోర్టు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014–17 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా, 2018 నుంచి ఇప్పటి వరకు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్నారు. 

ముమ్మినేని సుధీర్‌కుమార్‌..
1969, మే 20న ఖమ్మం జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది ఎంఆర్‌కే చౌదరి దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. 

కాసోజు సురేందర్‌...
1968లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించారు. 1992లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ పి.సీతాపతి వద్ద జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. 2005–2008 వరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. హైకోర్టులో 2010 నుంచి ఇప్పటివరకు సీబీఐ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సేవలు అందిస్తున్నారు. 

మిర్జా సఫియుల్లాబేగ్‌..
మహబూబాబాద్‌లో జన్మించారు. 2002లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది, తాత కేఎఫ్‌ బాబా దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. తర్వాత తండ్రి న్యాయవాది మిర్జా ఇమాముల్లా బేగ్, న్యాయవాది ఈ.ఉమామహేశ్వర్‌రావుల వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 2014 నుంచి తెలంగాణ వక్ప్‌బోర్డు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందిస్తున్నారు. 

ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌..
1967, ఆగస్టు 18న జన్మించారు. 2005లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. రావ్‌ అండ్‌ కంపెనీ లాయర్స్‌ ఆఫీస్‌లో జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. ఈయన దివంగత పీవీ నర్సింహారావు మనమడు. 

జి.అనుపమ చక్రవర్తి...
1970లో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వ్యాట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

మాటూరి గిరిజ ప్రియదర్శిని..
1964, ఆగస్టు 30న విశాఖపట్నంలో జన్మించారు. 1995లో బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకొని విశాఖపట్నం జిల్లా కోర్టులో ఏడేళ్లు న్యాయవాదిగా పనిచేశారు. 2008లో జిల్లా జడ్జి పరీక్షలో ఎంపికై గుంటూరులో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.

సాంబశివరావు నాయుడు..
1962, ఆగస్టు 1న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారు. న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యి 1986లో ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ పిల్లా జానకి రామయ్య దగ్గర జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. 1991లో డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌గా ఎంపికయ్యారు. తర్వాత సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఏసీబీ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. 

అలుగు సంతోష్‌రెడ్డి...
జగిత్యాల జిల్లా జొగన్‌పల్లిలో జన్మించారు. 1985లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. కరీంనగర్‌ జిల్లాలో ప్రాక్టీస్‌ చేశారు. 1991లో డిస్ట్రిక్‌ మున్సిఫ్‌గా ఎంపికయ్యారు. 2004లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. 2010లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి.. రాష్ట్ర విభజన తర్వాత 2017 వరకు కొనసాగారు. 2019లో తిరిగి న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులై విధులు నిర్వహిస్తున్నారు. 

డాక్టర్‌ డి.నాగార్జున..
వనపర్తి జిల్లాలో 1962, ఆగస్టు 15న జన్మించారు. 1986లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకొని వనపర్తి, మహబూబ్‌నగర్‌ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. 1991లో డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌గా ఎంపికయ్యారు. 2010లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top