ఏజెన్సీ విద్యార్థులకు ‘గిరిదర్శిని’!

State Tribal Welfare Department to better educate students of tribal ashram schools in agency areas - Sakshi

5 వేల ఆవాసాల్లోని 4 వందల పాఠశాలల పరిధిలో అమలు 

కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థుల ఇంటి వద్దకే స్టడీ మెటీరియల్‌ సరఫరా 

అసైన్‌మెంట్‌ పూర్తి చేసిన తర్వాత తిరిగి పాఠశాలలకు చేరవేత 

ఆన్‌లైన్‌ బోధనాసౌకర్యంలేని విద్యార్థులకు మరింత ఉపయుక్తం 

విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య వారధిగా తపాలా శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నడుంబిగించింది. ఈ మేరకు ‘గిరిదర్శిని’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌ నేపథ్యంలో పాఠశాలలు ఇంకా తెరుచుకోకపోవడం, ఆన్‌లైన్‌ పద్ధతిలోనే బోధన సాగుతుండటంతో విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయుక్తం కానుంది. అయితే పాఠశాలలకు విద్యార్థులు వచ్చి స్టడీ మెటీరియల్‌ తీసుకునే బదులుగా వారి ఇళ్లకే నేరుగా పంపడం, అందులోని నిర్దేశిత అసైన్‌మెంట్‌ను పూర్తి చేసిన తర్వాత తిరిగి వాటిని సేకరించి పాఠశాలలకు చేర్చే బాధ్యతను తపాలా శాఖకు అప్పగించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య తపాలాశాఖ వారధిగా వ్యవహరించనుంది. గిరిజన సంక్షేమ శాఖతో తపాలాశాఖ అవగాహన కుదుర్చుకుంది. 3 నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికీ స్టడీ మెటీరియల్‌ అందించేలా గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది.

ఆన్‌లైన్‌ సౌకర్యం లేని వారికి..
ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఇంటర్నెట్‌ సౌకర్యం, స్మార్ట్‌ ఫోన్లు, వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. దాదాపు 5 వేల ఆవాసాల్లోని 400 పాఠశాలల పరిధిలో అలాంటి విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ బోధనతోపాటు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో బోధన, అభ్యసన కార్యక్రమాల నిమిత్తం స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. నాలుగైదు రోజుల్లో నిర్దేశించిన పాఠశాలల విద్యార్థులకు తపాలా శాఖ ద్వారా స్టడీ మెటీరియల్‌ పంపిణీ కానుంది. స్టడీ మెటీరియల్‌ వినియోగం, అసైన్‌మెంట్‌ వర్కవుట్‌పై సూచనలూ అందులోనే ఇచ్చారు. మరోవైపు ఫోన్లు అందుబాటులో ఉన్న విద్యార్థులతో ఉపాధ్యాయులు నిత్యం మాట్లాడి సందేహాలను నివృత్తి చేస్తారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top