జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో స్టాఫ్‌ నర్సుల రాత పరీక్ష | Staff Nurses Written Exam conducted by JNTU | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో స్టాఫ్‌ నర్సుల రాత పరీక్ష

Mar 22 2023 3:21 AM | Updated on Mar 22 2023 3:21 AM

Staff Nurses Written Exam conducted by JNTU - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టాఫ్‌ నర్సుల పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష బాధ్యతను జేఎన్‌టీయూకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే పరీక్ష పేపర్‌ను మాత్రం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే తయారు చేస్తారు. మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల టీఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీకేజీ నేపథ్యంలో స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల పరీక్షను నిర్వహించడంపై అధికారుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు భారీగా కసరత్తు ప్రారంభించారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీని దృష్టిలో పెట్టుకొని అదనపు చర్యలు తీసుకుంటున్నారు.  

భారీ డిమాండ్‌... 
స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. వైద్య ఆరోగ్యశాఖ 5,204 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ భర్తీ చేయనుంది. మొత్తంగా 40 వేల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. ఒక్కో స్టాఫ్‌ నర్స్‌ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్‌ రూ. 36,750 – రూ. 1,06,990 మధ్య ఉంటుంది. దాంతో అభ్యర్థుల నుంచి భారీగా డిమాండ్‌ ఏర్పడింది.

కాగా వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్‌ తీసుకుంటున్నారు. కాగా, రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్‌­సోర్సింగ్‌ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు.  

రాతపరీక్ష సిలబస్‌ ఇదీ..
అనాటమీ ఫిజియాలజీల­లో 14 అంశాలు, మైక్రోబయా­­లజీలో 6 అంశాలు, సై కాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ నర్సింగ్, ఫస్ట్‌ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ హైజీన్, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్, చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్, మిడ్‌ వైఫరీ గైనకాలాజికల్‌ నర్సింగ్, గైనకాలజియల్‌ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, నర్సింగ్‌ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్‌ టు రీసెర్చ్, ప్రొఫెషనల్‌ ట్రెండ్స్‌ అండ్‌ అడ్జస్ట్‌మెంట్, నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వార్డ్‌ మేనే­జ్‌మెంట్‌లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్‌ ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు తయా­రు కావాలని నిపుణులు సూచిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement