అసలేం జరుగుతోంది? డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో..

So Many Doubts Suspicions In Degree student Maina Suicide Case Jadcherla - Sakshi

సాక్షి, జడ్చర్ల: డిగ్రీ విద్యార్థిని మునావత్‌ మైన(19) ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు కళాశాలలో అసలేం జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో చరిత్ర కలిగి ఉండి ఇటీవలే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల.

దీనికితోడు బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటు, హెర్బేరియం గుర్తింపు తదితర కార్యక్రమాలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు ఉండగా.. మరోవైపు కొందరు ఆడపిల్లల పట్ల అనుచిత భావన కలిగి ఉన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గురుశిష్యుల బందాన్ని తప్పుగా అర్థం చేసుకోలేరన్న భావనను కొందరు లెక్చరర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి. 

వైరల్‌ అయిన ఫొటోలు 
విద్యార్ధిని మైన ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఓ విద్యార్ధినితో ఓ లెక్చరర్‌ కలిసి ఉన్న ఫొటోలు గురువారం ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రెస్టారెంట్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న సమయంలో కొందరు వారిని అనుసరించి దూరంగా ఉండి తీసినట్లుగా ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ ఫొటోలలో ఉన్న విద్యార్థిని ఎవరన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. 
సంబంధిత వార్త: Viral Video: అవమాన భారం.. తీసింది ప్రాణం

వీడియో ఎవరు తీశారు? 
విద్యార్థిని మైనా ఆత్మహత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్న వీడియోను ఎవరు తీశారన్నది తెలియాల్సి ఉంది. డిగ్రీ కళాశాల తరగతి గదిలో ఆ రోజు ఎందుకు గొడవ జరిగింది. ప్రిన్సిపాల్, లెక్చరర్లు చెబుతున్నదే నిజమా.. మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారించాల్సి ఉంది. అసలు ఈ గొడవలో దాడికి పాల్పడిన విద్యార్థిని, ఫొటో తీశారని చెబుతున్న మరో విద్యార్థిని, లెక్చరర్ల పాత్ర ఎంత మేరకు ఉందో కూడా విచారించాల్సి ఉంది.

ఆత్మహత్య చేసుకున్న మైన తాను తీసిన ఫోటోలను ఎవరికి పంపిందో కూడా తెలియాల్సి ఉంది. లెక్చరర్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిఘా వేసి బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా..? అన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఓ లెక్చరర్, ఓ విద్యార్థిని ఎక్కడెక్కడ తిరిగిన ఫొటోలో తీయాల్సిన అవసరం ఎవరికి ఉండి ఉందో కూడా తేలాల్సిన అవసరం ఉంది. 

విద్యాబోధన గాలికొదిలారా..? 
విద్యా బోధనను గాలికి వదిలేసి, బోధనేతర కార్యక్రమాలపై లెక్చరర్లు దృష్టి సారించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్సిపాల్‌ చిన్నమ్మ అడ్మినిస్ట్రేషన్‌లో కొంత వీక్‌గా ఉన్నారన్న ప్రచారం ఉంది. పోలీసులు, ఉన్నత విద్యాధికారులు జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కళాశాల ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడిన మైన ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నాగర్‌కర్నూల్‌ సీఐ హన్మంతు ‘సాక్షి’ వివరణ కోరగా.. ప్రస్తుతానికి అలాంటిదేమి లేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కళాశాలలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావును ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ వెంకట్రావ్‌ సస్పెండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top