Viral Video: అవమాన భారం.. తీసింది ప్రాణం

Degree Student Maina Commits Suicide in Jadcherla - Sakshi

తోటి విద్యార్థిని కొట్టిన చెంపదెబ్బ వీడియో వైరల్‌ కావడంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య 

జడ్చర్ల ప్రభుత్వ బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత 

పెళ్లయిన మరో విద్యార్థిని ఓ అబ్బాయితో మాట్లాడుతుండగా ఫొటో తీయడంతో గొడవ జరిగిందంటున్న లెక్చరర్లు

సాక్షి, జడ్చర్ల:  తరగతి గదిలో ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ ఒక ఆత్మహత్యకు దారి తీసింది. ఓ విద్యార్థిని మరో విద్యార్థిని చెంపపై కొట్టిన దృశ్యాన్ని ఇతరులు వీడియో తీసి వైరల్‌ చేయడంతో.. చెంపదెబ్బ తిన్న విద్యార్థిని మనస్తాపంతో పురుగులమందు తాగింది. దీనిపై ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఆందోళన సమాచారం అందిన పోలీసులు కాలేజీ వద్ద భారీగా మోహరించారు. విద్యార్థులను వెనక్కి పంపించి ప్రధాన గేటు మూసివేసినా.. విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీలోకి చొచ్చుకువచ్చి ప్రిన్సిపాల్, లెక్చరర్లతో వాగ్వాదానికి దిగారు. 

అసలేం జరిగింది? 
నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం హనుమాన్‌తండాకు చెందిన ముడావత్‌ మైనా (19) జడ్చర్లలోని బీఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ (బీజెడ్‌సీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం తరగతి గదిలో మైనాతో తోటి విద్యార్థిని దేవయాని గొడవ పెట్టుకుంది. మైనా చెంపపై కొట్టింది. ఈ గొడవను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్‌ చిన్నమ్మ, లెక్చరర్లు గొడవపడిన విద్యార్థినులకు అదేరోజున కౌన్సెలింగ్‌ ఇచ్చి సర్దిచెప్పారు. కానీ తీవ్ర మనస్తాపానికి గురైన మైనా బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

కాలేజీ వద్ద ఉద్రిక్తత 
దీనితో మైనా కుటుంబ సభ్యులు, బంధువులు, కొందరు విద్యార్థులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. కాలేజీలోకి చొచ్చుకువెళ్లి ప్రిన్సిపాల్, లెక్చరర్లతో వాగ్వాదానికి దిగారు. మైనాపై దాడి జరిగితే తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్‌ చిన్నమ్మ అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. కొందరు విద్యార్థులు ఆమెను వైద్యం కోసం బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీనితో ఒక వైద్యుడిని కాలేజీకి రప్పించి ప్రిన్సిపాల్‌కు చికిత్స అందజేశారు. 

మృతదేహంతో రాస్తారోకో 
మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో మైనా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత స్వగ్రామానికి తరలిస్తుండగా.. జడ్చర్లలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ వద్ద ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 

వేరే అమ్మాయి ఫొటో తీసిందని గొడవ! 
పెళ్లయిన ఓ విద్యార్థిని తరగతి గదిలో తోటి విద్యార్థులైన అబ్బాయిలతో మాట్లాడుతుండగా మైనా ఫోన్‌లో ఫొటో తీసిందని.. సదరు విద్యార్థిని భర్త మిత్రుడికి ఆ ఫొటోను పంపడంతో గొడవ జరిగిందని ప్రిన్సిపాల్‌ చిన్నమ్మ, లెక్చరర్లు మీడియాకు వివరించారు. సదరు వివాహిత విద్యార్థిని స్నేహితురాలు దేవయాని జోక్యం చేసుకుని మైనా చెంపపై కొట్టిందన్నారు. ఈ విషయం తెలియడంతో ముగ్గురు విద్యార్థినులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపామని తెలిపారు. 

లెక్చరర్‌ వేధింపులే కారణం 
ఓ లెక్చరర్, ఇద్దరు విద్యార్థినుల కారణంగా తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మైనా తల్లి మణెమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపించారు. లెక్చరర్‌ కారణంగానే మైనా ఆత్మహత్య చేసుకుందని రాసిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. సదరు లెక్చరర్‌ కొందరు విద్యార్థినులతో చనువుగా ఉండేవాడని.. సదరు లెక్చరర్‌ ప్రోత్సాహంతోనే విద్యార్థినులు మైనాపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 

ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నాం: పోలీసులు 
బిజినేపల్లి: మైనా ఆత్మహత్యకు లెక్చరర్‌ వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు తిమ్మాజిపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై షంషుద్దీన్‌ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. బుధవారమే యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, గురువారం వారు చేసిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top