
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగడం పట్ల ఐఏ ఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ప్రభుత్వం వద్ద అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖపై నిర్వహిస్తున్న సమీక్షలకు ఆమె ఎందుకు రావడం లేదని ఇటీవల ఆ శాఖమంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించగా.. ఈ మేరకు అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం మిషన్ భగీరథ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రజత్‌కుమార్ పదవీ విరమణ చేసిన సమయంలో స్మితా సబర్వాల్‌కు నీటిపారుదల శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగి స్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జా రీచేశారు. అయితే ఆమె ఆ బాధ్యతలు స్వీకరించలేదు. నీటిపారుదల శాఖ కార్య దర్శిగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఆ పోస్టులో కొనసాగుతానని స్మితా సబర్వాల్ పేర్కొన్నారని ఆశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫైళ్లపై సంతకాలు చేయడానికి కూడా ఆమె అయిష్టత వ్యక్తంచేయడంతో రెండు వారాలుగా ముఖ్యమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయని వెల్లడించారు.