ఆ ముగ్గురూ ఎక్కడ?

SCCL Mishap: One Miner Rescued After 26 Hours In Telangana - Sakshi

సింగరేణి గనిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌.. గల్లంతైన కార్మికుల కుటుంబాల్లో ఆందోళన 

26 గంటలు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడిన బదిలీ కార్మికుడు రవీందర్‌ 

సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు (ఏఎల్‌పీ)లో జరిగిన ప్రమాదం నుంచి మంగళవారం ఓ కార్మికుడిని రెస్క్యూ టీం రక్షించింది. గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ప్రమాదం జరిగి 40 గంటలవుతున్నా వారి జాడ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.

ఏఎల్‌పీ బొగ్గుగనిలో 86వ లెవల్‌ వద్ద రూఫ్‌ బోల్డ్‌ పనులు చేస్తుండగా సోమవారం ప్రమాదం జరిగింది. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్‌సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్‌ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాజ్, శ్రీకాంత్‌ కోసం గాలిస్తున్నారు.

40 గంటలుగా నీరు, ఆహారం లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. బొగ్గుపెళ్లలను తొలగించడానికి చాలా సమయం పడుతోంది. గల్లంతైన వారి ఆచూ కీ బుధవారం ఉదయం కల్లా తెలియొచ్చని భావిస్తున్నారు. 4 షిఫ్టులుగా వీడిపోయి షిఫ్టుకు 100 మంది  గాలింపు చేపట్టారు. ఫ్రంట్‌ బకెట్‌ లోడర్‌ (ఎఫ్‌బీఎల్‌) ఆపరేటర్‌ జాడి వెంకటేశ్, ఓవర్‌మేన్‌ పిల్లి నరేశ్, బదిలీ కార్మికుడు రవీందర్, సపోర్టుమేన్‌ ఎరుకల వీరయ్య  ప్రమాదం నుంచి బయటపడ్డారు.

బొగ్గు పెళ్లల సందులోంచి పాక్కుంటూ బయటపడ్డానని ఆయన అన్నారు. యంత్రంతో పనిచేస్తుండగా బొగ్గుపెళ్ల కూలి చీకటైందని, రెస్క్యూ సిబ్బంది అరుపులు విని యంత్రం హారన్‌ మోగించడంతో తనను బయటకు తీశారని జాడి వెంకటేశ్‌ చెప్పారు. కాళ్లు బొగ్గుపెళ్లల్లో చిక్కుకొని గాయాలయ్యాయని, నడుం పైభాగంలో దెబ్బలు లేకపోవడంతో బతకగలిగానని రవీందర్‌ అన్నారు. 

కనీస సమాచారం ఇవ్వలేదు 
గని ప్రమాదంలో చిక్కుకున్న డిప్యూటీ మేనేజర్‌ చైతన్యతేజ పరిస్థితిపై యాజమాన్యం మాకు సమాచారం ఇవ్వ లేదు. ఓ ఉద్యోగి ప్రమాదంలో చిక్కుకుంటే కుటుంబీకులకు సమాచారం ఇవ్వరా? తేజ ఇంటి పక్కన ఉండేవాళ్లు ఫోన్‌ చేస్తే వచ్చాం.     

– చైతన్య తేజ తండ్రి సీతారాములు, మామ వెంకటేశ్వర్లు 

ట్రైనింగ్‌ అయిపోతుందన్నాడు 
ట్రైనింగ్‌ ఈ రోజుతో అయిపోతుందని సోమవారం చెప్పి గనిలోకి వచ్చాడు. గని ప్రమాదంలో చిక్కుకున్నాడని టీవీలో వార్తలు చూసి ఇక్కడికి వచ్చాను. అన్నయ్య పరిస్థితిపై ఎవరిని అడిగినా చెప్పడం లేదు. రెండురోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తూ ఎదురుచూస్తున్నాం. సహాయకచర్యలు ముమ్మరంగా చేపట్టి అన్నయ్యను త్వరగా బయటకు తీసుకురావాలి.   
   
–వీటీసీ ట్రైనీ తోట శ్రీకాంత్‌ సోదరుడు రాకేశ్‌ గనిలో రెస్క్యూ బృందం సహాయక చర్యలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top