కేబీఆర్‌ పార్కు: ప్లీజ్‌ ఇక్కడ నేనున్నానని అందరికీ చెప్పరూ!

Save Our Soul Tower At KBR Park Hyderabad - Sakshi

ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం

అవగాహన లేక నిరుపయోగం

కేబీఆర్‌ పార్కు వద్ద దిష్టిబొమ్మలా ఎస్‌వోఎస్‌ స్తంభం

ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అవతలి వారికి ఆ విషయం తెలియజేసేందుకు పూర్వకాలంలో గ్రామాలు, ఇతర చారిత్రక ప్రాంతాల్లో ధర్మ గంటలు ఏర్పాటు చేసేవారు. సమస్య ఉన్న వారు ఇక్కడికి వచ్చి ధర్మ గంటను మోగిస్తే సంబంధిత అధికారులు లేదా గ్రామ పెద్దలు అక్కడికి వచ్చి వారి సమస్యను విని పరిష్కరించేవారు.

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద ‘సేవ్‌ అవర్‌ సోల్‌’ (ఎస్‌వోఎస్‌) టవర్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు ముందు ఏర్పాటు చేసిన ఈ స్తంభానికి పైన ఒక కెమెరా ఏర్పాటు చేశారు. మధ్యలో ఒక బటన్‌ ఏర్పాటు చేసి అది నొక్కి మాట్లాడితే సంబంధిత కమాండ్‌ కంట్రోల్‌లో వారు చెప్పేది వినడమే కాకుండా వారు ఎవరో చూసేందుకు కూడా కెమెరాలు బిగించారు. 
చదవండి: సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో...

► ఈ ఎస్‌వోఎస్‌ స్తంభం ఏర్పాటు చేసిన ఏడాదిన్నర తర్వాత ఇటీవలే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 
►  అయితే ఇక్కడొక ధర్మగంట ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. 
► వారం క్రితం ఇదే కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో సినీ నటి షాలూ చౌరాసియాపై, ఈ నెల 2వ తేదీన ఫిలింనగర్‌కు చెందిన ఓ యువతిపై, జనవరి 22వ తేదీన ఓ వైద్యురాలిపై ఆగంతకుడు దాడి చేశాడు. ఆ సమయంలో ఇలాంటి ధర్మగంట ఆ ప్రాంతంలో అందుబాటులో ఉండి ఉంటే వీరు క్షణాల్లో తమ సమస్యను చెప్పుకొని పోలీసుల దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లే ఆస్కారం ఉండేది. 
► ఈ ఎస్‌వోఎస్‌ స్తంభం గురించి చాలా మందికి తెలియదు. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో కూడా ఈ ఎస్‌వోఎస్‌కు సంబంధించి కనెక్షన్‌ కూడా బిగించారు. 
► ఎవరైనా తమ సమస్యను చెప్పుకోగానే క్షణా­ల్లో సమీపంలోని పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి చేరుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై బాధితులకు న్యాయంచేసే విధంగా ఏర్పాట్లు చేశారు. 
చదవండి: టీఎస్‌ఆర్టీసీపై కిన్నెరసాని మొగులయ్య పాట..

► తీరా లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ఎస్‌వోఎస్‌ స్తంభం ఎవరికీ తెలియని దుస్థితిలో ఉండిపోయింది. 
► కనీసం ఆ స్తంభం విషయంలో అవగాహన కల్పించాలనే ఆలోచన కూడా సంబంధిత అధికారులకు లేకుండా పోయింది. పలుమార్లు ఈ ఎస్‌వోఎస్‌ స్తంభంపై అవగాహన కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
► కేబీఆర్‌ పార్కుతో పాటు పీవీఎన్‌ఆర్‌మార్గ్‌లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
► బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వద్ద, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 92 సీవీఆర్‌ న్యూస్‌ వద్ద, స్టార్‌ బక్స్‌ హోటల్‌ వద్ద, కళింగ కల్చరల్‌ ట్రస్ట్‌ అగ్రసేన్‌ చౌరస్తాలో, బాలకృష్ణ ఇంటి ముందు వీటిని ఏర్పాటు చేయడం ద్వారా వాకర్లకు, సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీరు పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top