పండుగ ప్రయాణం.. ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లాలని నరకయాతన

Sankranti 2023: Traveling Native Places Spending a lot effort - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా తర్వాత పూర్తి స్థాయిలో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు జనం ఉత్సుకత కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే పల్లె బాట పట్టి ఖర్చుకు సైతం వెనకాడకుండా.. నరకయాతన అనుభవిస్తున్నారు. నగరం నుంచి ఇప్పుడు సొంతూళ్లకు ప్రయాణమంటే నరకమనే అర్థం!!. 

సంక్రాంతికి ప్రయాణాల కోసం బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు సుఖవంతమైన ప్రయాణం లేకున్న పర్వాలేదనుకుని.. తోపులాటలో నిల్చుని మరీ ఊళ్లకు పయనమయ్యారు. ఇంకోవైపు నగరాలు, పట్టణాల్లోని రోడ్లు, జాతీయ రహదారులు.. విపరీతమైన వాహన రద్దీతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్‌ జామ్‌తో పడిగాపులు పడాల్సి వస్తోంది. 

రైళ్లు, బస్సు ప్రయాణాలకు మూడు, నాలుగు నెలల ముందే బుకింగ్‌లు అయిపోయాయి. దీంతో ప్రయాణాల కోసం బ్లాక్‌ దందాలను ఆశ్రయిస్తున్నారు చాలామంది. ఆ దందాలను కట్టడి చేసేందుకు అధికారులు యత్నిస్తున్నా.. ప్రయాణం ఎలాగైనా సాగాలని అవేం పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు కొందరు. ఇక విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లకు ప్రయాణికుల తాకిడి పెరిగిపోయింది.    

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. సొంతూళ్లకు ప్రయాణికులు క్యూ కడుతుండడంతో కిటకిలాడుతున్నాయి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. బస్సుల్లో సీట్లు దొరక్క చివరి నిమిషంలో ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు మరికొందరు ప్రయాణికులు. అయితే అందులోనూ కుక్కి కుక్కి మరీ ప్రయాణాలు చేయిస్తున్నారు. 

ఈసారి సంక్రాంతికి 140 ప్రత్యేక రైళ్ళను ప్రకటించించింది దక్షిణ మధ్య రైల్వే. కానీ, ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో.. ఆ రైళ్లు ఎటూ సరిపోలేదు!. దీంతో స్టేషన్‌ బయటే ప్రయాణికులు ఎదురు చూపులు చూసే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కనెక్టవిటీ ఎంఎంటీఎస్‌ రైళ్లు మరమ్మత్తుల పనులతో రద్దు కావడంతో.. భారమైన సరే ఖర్చు పెట్టుకుని బస్టాండ్‌లకు, స్టేషన్లకు చేరుకుంటున్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా
సంక్రాంతి పండుగకు వాహనాలు రహదారి ఎక్కడంతో.. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల‌ రద్దీ కొనసాగుతోంది. పండుగకు మామూలు రోజులకంటే అధికంగా వాహనాల తాకిడి నెలకొంటుందనేది తెలిసిందే. అయితే ఈసారి ఆ తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువ వస్తోంది. ఫాస్టాగ్‌ ఉన్నా కూడా అర కిలోమీటర్‌ పైనే వాహనాలు జారీ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  మామూలు రోజుల్లో 30-35 వేల‌ వాహనాల‌ రాకపోకలు సాగించేవని, కానీ, గత మూడు రోజుల నుంచి యాభై వేల వాహనాల రాకపోకలు కొనసాగించాయని జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు వాహనాల రద్దీని తట్టుకునేందుకు అదనపు టోల్ బూతులను తెరచినట్లు వెల్లడించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top