సాక్షి, రంగారెడ్డి జిల్లా: ల్యాండ్ పూలింగ్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్ట విరుద్దంగా పేదల భూములను లాక్కుంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూములు ఎందుకు తీసుకుంటున్నారంటూ నిలదీశారు. ఏం కంపెనీలు పెడతారు? ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పకుండా పేదలను మోసం చేసి అన్యాయంగా విలువైన భూములను ఆక్రమించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేనపుడు ప్రభుత్వం పేదల భూములు సేకరించడం చట్టవిరుద్దమన్నారు. షాబాద్ మండలంలోని రేగడిదొస్వాడ, మక్తగూడెం, తాళ్లపల్లి, తిమ్మారెడండిగూడెం గ్రామాలకు చెందిన ఎస్సీల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈశా ఫౌండేషన్ కోసం భూములు ఇవ్వడానికి పేదల భూములే దొరికాయా? అందుకోసం ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు కేటాయించవచ్చు కదా అని నిలదీశారు. ధనవంతులు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించే ఆశ్రమాల కోసం పేద ఎస్సీల భూములు కావాలా అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి మేమూ భూస్వాములమేనని చెప్పుకున్నారు,మరి వాల్ల భూములను ఈశా ఫౌండేషన్ వారికి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈశా ఫౌండేషన్ వల్ల ఇక్కడి పేదలకు జరిగే లాభం ఏంటని అడిగారు. పేదలకు ఉద్యోగాలిస్తారా,చదువు చెప్తారా? హాస్పిటల్ నిర్మిస్తారా అంటూ ధ్వజమెత్తారు.దానివల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

చేవెళ్ల సాక్షిగా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో, పేదల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక, లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమిని లక్కోవాలని చూశారని, ఇపుడు సద్గురు బాబా కోసం రేవంత్ బాబా ఎస్సీల భూములు లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసిఆర్ పేదలను పుట్టినప్పటి నుండి కేసిఆర్ కిట్ ఇచ్చి,గురుకులాలు పెట్టి డాక్టర్లను తయారు చేసి, పేదలకు మూడు ఎకరాల భూమి ఇచ్చి,దళిత బంధుతో వ్యాపారస్తులుగా తయారు చేయాలని చూశారన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పేదల భూములు లాక్కొని నిరాశ్రయులను చేసి,అడ్డా కూలీలుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.

కంపెనీలు పెట్టుకోవడానికి హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నా,రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల భూమిని లాక్కొని వారి పొట్ట కొట్టాలని చూస్తున్నారన్నారు. కంపెనీల కోసం కేటాయించిన భూములను హిల్ట్ పాలసీ కింద తక్కువ ధరకు అమ్ముకోవాలని చూస్తున్నారన్నారు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో పెట్టే ప్రతి సంతకం, పేదలకు వ్యతిరేకంగానే చేస్తున్నారన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టా బుక్ జారీచేసి,పేదలకు భూములపై సర్వ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే షాబాద్ మండలంలోని రేగడిదోస్వాడలో భూమి సేకరణకు ప్రయత్నం చేస్తే, లగచర్ల స్పూర్తిగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, భూమి మార్కెట్ విలువకు 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అంతేకాకుండా భూమికి బదులు భూమే కావాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు న్యాయం జరిగేదాక పోరాడతామన్నారు.


