ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ 189 కి.మీలతో..

RRR Road Alignment Has Been Finalized In Southern Part - Sakshi

అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిన ఎన్‌హెచ్‌ఏఐ 

పాత రోడ్లను అనుసంధానిస్తూ మరో రెండు అలైన్‌మెంట్లు 

పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుగా ఉండే మూడో ప్లాన్‌ ఎంపిక 

ఈ వారంలో తుది ఆమోదం.. ఆ వెంటనే డీపీఆర్‌ తయారీ  

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం 189.23 కి.మీ. నిడివితో నిర్మాణం కానుంది. ఈ మేరకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీకి చెందిన ఇంటర్‌ కాంటినెంటల్‌ టెక్నోక్రాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూపొందించిన మూడు అలైన్‌మెంట్లలో 189.23 కి.మీ. నిడివి ఉన్న అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. దీనికి ఈ వారంలో అధికారిక ఆమోదం లభించనుంది. అనంతరం అధికారులు డిటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు(డీపీఆర్‌) రూపొందించనున్నారు.  

జలాశయాలు.. చెరువులు.. గుట్టలను తప్పిస్తూ.. 
రీజినల్‌ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం ఓ కన్సల్టెన్సీని నియమించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ప్రాథమికంగా 182 కి.మీ. నిడివితో ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ఆ తర్వాత ప్రాజెక్టు కొంత డోలాయమానంలో పడింది. అంతగా వాహనాల రాకపోకలు లేని మార్గం కావటంతో దక్షిణ భాగానికి నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్‌ వే అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఆ తర్వాత కేంద్రప్రభుత్వం దక్షిణ భాగానికి ఆమోదిస్తూ గత ఆగస్టులో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీని నియమించింది. ప్రాథమిక అలైన్‌మెంట్‌ ఆధారంగానే ఈ సంస్థ క్షేత్రస్థాయిలో పర్యటించి దానికి మార్పుచేర్పులతో మూడు వేరు వేరు అలైన్‌మెంట్లను రూపొందించింది. 

ప్రస్తుతం ఉన్న షాద్‌నగర్, కంది, ఆమన్‌గల్‌.. తదితర రోడ్లలో కొంత భాగాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌లోకి చేరుస్తూ రెండు అలైన్మెంట్లను రూపొందించింది. పాత ఎన్సల్టెన్సీ సంస్థ ప్రాథమికంగా రూపొందించిన పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ను సరిదిద్దుతూ మూడో అలైన్మెంటును సిద్ధం చేసింది. ప్రాథమిక అలైన్‌మెంట్‌ నిడివిని పెంచనప్పటికీ, దానికి అడ్డుగా ఉన్న చెరువులు, గుట్టలను తప్పిస్తూ మార్పులు చేశారు. భవిష్యత్తులో నిర్మించే పాలమూరు ప్రాజెక్టు కాలువలను దృష్టిలో పెట్టుకుని చిన్న, చిన్న మార్పులు చేశారు. దీంతో పాత అలైన్‌మెంట్‌ కంటే దాదాపు ఏడు కి.మీ. అదనపు నిడివితో కొత్త అలైన్‌మెంట్‌ ఏర్పడింది. పాత రోడ్లను జత చేస్తూ రూపొందించిన రెండు అలైన్‌మెంట్లు ఆచరణ సాధ్యం కాదని ఎన్‌హెచ్‌ఏఐ తిరస్కరించింది. పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ మార్గంగా ఏర్పడ్డ మూడో అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది.  

రూ.15 వేల కోట్ల వ్యయం? 
ఉత్తర భాగం నిర్మాణానికి దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చవుతాయన్న ప్రాథమిక అంచనా ఉండగా, ఇటీవల కేంద్రం రూ.13 వేల కోట్లతో దానికి బడ్జెట్‌ రూపొందించింది. రోడ్డు నిర్మాణానికి రూ.8 వేల కోట్లు, భూసేకరణకు రూ.5,200 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. ఈ లెక్కన దక్షిణ భాగానికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారిక వర్గాల అంచనా. పూర్తిస్థాయి డీపీఆర్‌ రూపొందించాక స్పష్టత వచ్చే అవకాశముంది. సంగారెడ్డి నుంచి కంది, నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్‌ నారాయణపూర్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు నిర్మించే దక్షిణ భాగాన్ని కేంద్రప్రభుత్వం భారత్‌మాల పరియోజన పథకం–2 కింద ఎంపిక చేసింది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top