
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే ‘మహా న్యూస్’లో కథనాలు
వీటిని ముక్త కంఠంతో ఖండించాలి
పంజగుట్ట: మహా న్యూస్ టీవీ చానల్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, అదే సమయంలో ఆ టీవీ చానల్‌లో నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే మహాన్యూస్ చానల్‌లో పలువురు నేతలను కించ పర్చేలా కథనాలు ప్రసారమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ మధ్య కొన్ని టీవీ చానళ్లలో నడుస్తున్న డిబేట్లు, ప్రసారమవుతున్న కథనాలు, థంబ్‌నెయిల్స్ ద్వారా తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సిగ్నల్ టీవీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మీడియా, పరిణామాలు, పర్యవసానాలు’ అనే అంశంపై మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి పదేళ్లు దాటింది కాబట్టి తెలంగాణ అనే పదాన్ని వాడొద్దని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అంటున్నారని, తెలంగాణ అనే పదం లేకపోతే మనకు అస్తిత్వం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టు సంఘాలు అన్ని ఏకమై కొన్ని టీవీ చానళ్లలో వస్తున్న తెలంగాణ వ్యతిరేక ప్రసారాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
వీటిపై నియమ నిబంధనలు రూపొందించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో దోషులెవరో తేలక ముందే కేసీఆర్, కేటీఆర్‌పై దాడి చేయడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అనే పదం వాడొద్దు అన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి.. సీనియర్ పాత్రికేయుడు యోగికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నర్రా విజయ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సాగర్, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.