రాష్ట్రంలో ‘ఇండస్ట్రీ 4.0’ ప్రాజెక్టు | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ‘ఇండస్ట్రీ 4.0’ ప్రాజెక్టు

Published Sun, Dec 31 2023 3:00 AM

Revanth Reddy meeting with representatives of Tata Technologies at  Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 50 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో రూ. 1,500 – 2,000 కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్‌ ముందుకొచ్చింది. ‘ఇండస్ట్రీ 4.0’ ప్రాజెక్టు పేరుతో ఐటీఐల ద్వారా యువతకు ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్, రోబోటిక్స్‌ తయారీ, అధునాతన సీఎస్‌సీ మెషినింగ్‌ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్‌ డిజైనర్, వర్చువల్‌ వెరిఫయర్‌ వంటి కోర్సుల్లో నైపుణ్య శిక్షణ అందించడానికి టాటా సంస్థ ముందుకు రాగా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వాగతించారు.

రాష్ట్రంలో ‘ఇండస్ట్రీ 4.0’ స్కిల్‌ సెంటర్లను ఏర్పాటుచేయడంతోపాటు వాటి నిర్వహణకు కావాల్సిన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను టాటా సంస్థ అందిస్తుంది. దాదాపు లక్ష మంది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ అందించడంతోపాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా వారి నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ప్రతినిధులతో శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేమయ్యారు.

నైపుణ్యాభివృద్ధిలో టాటా సంస్థతో ప్రభుత్వం కలసి పనిచేస్తుందని, ఇందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. టాటా టెక్నాలజీస్‌తో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. 

ఐదేళ్ల పాటు ఉచిత సహకారం
‘ఇండ్రస్ట్రీ 4.0’ ప్రాజెక్టులోని కోర్సుల నిర్వహ ణకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్‌వేర్‌ అందించడంతో పాటు ప్రతీ ఐటీఐకి ఇద్దరు మాస్టర్‌ ట్రెయినర్లను టాటా సంస్థ అందిస్తుంది. ఈ ప్రాజెక్టును ఐదేళ్లపాటు టాటా సంస్థ ఉచితంగా నిర్వహించనుంది. ఆధునిక సాంకేతిక వర్క్‌షాపులు, తయారీ రంగంలో అత్యధి క డిమాండ్‌ కలిగి ఉపాధికి అవకాశాలున్న 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటె క్నిక్, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ అందిస్తుంది. ఎంఓయూ విధివిధానాల ఖరారుకు ఉపాధికల్పన, కార్మిక శాఖ టాటా సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. దీని ఆధారంగానే రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఐటీఐలను గుర్తిస్తారని అధికారులు చెప్పారు.

ప్రపంచంతో పోటీపడేలా..: సీఎం 
ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి కృతనిశ్చయంతో ఉన్నామ న్నారు. కోర్సులు పూర్తైన వెంటనే ఉద్యోగం, ఉపాధి, సొంతంగా పరిశ్రమ లను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు.

కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృథా చేయకుండా ఆధునా తన కోర్సుల్లో శిక్షణ కోసం చర్యలు తీసుకోవాల న్నారు. ఈ సమావేశంలో టాటా టెక్నాలజీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీవీ కౌల్గుడ్, గ్లోబల్‌ హెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుశీల్‌ కుమార్, కార్మిక, ఉపాధికల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎంఓ అధికారులు శేషాద్రి, షానవాజ్, అజిత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement