అంగన్‌వాడీలకు ఉద్యోగ విరమణ ప్యాకేజీ! 

Retirement Package For Telangana Anganwadi Teachers And Helpers - Sakshi

మహిళాభివృద్ధి శాఖ కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ అంశం త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం నుంచి సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్‌పై ప్రత్యేక నిబంధనలేమీ లేవు. ప్రస్తుతం వారికి గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగ విరమణ విషయంలో కూడా విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది.

ఈ దిశగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వారి రిటైర్మెంట్‌ ప్యాకేజీ కోసం ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆయా సంఘాల ప్రతినిధులతో పలుమార్లు చర్చించి అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. 

53 వేల మంది ఉద్యోగులు.. 
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ (సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసు) ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ఐసీడీఎస్‌లు గ్రామీణ ప్రాంతాల్లో, 25 పట్టణ ప్రాంతాల్లో, మరో 25 ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుకాగా, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.

వీటి పరిధిలో దాదాపు 55 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. ఇందులో 27 వేల మంది టీచర్లు, 25 వేలకు పైగా హెల్పర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మాత్రం 60 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లలో దాదాపు 9 వేల మంది పదవీ విరమణ వయసు దాటిన వారు ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు గతేడాది అంచనా వేశారు.

ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వయసు మీదపడిన వారికి విశ్రాంతి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుప్రీంకోర్టు పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రాట్యుటీ ఇవ్వాలని ఆదేశించించిన నేపథ్యంలో అంగన్‌వాడీలకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్యాకేజీని రూపొందిస్తోంది. 

ప్యాకేజీలో ప్రతిపాదించిన ప్రధాన అంశాలు.. 
♦ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.2 లక్షలు ఇవ్వాలని శిశుసంక్షేమ శాఖ భావిస్తోంది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ వేతనాన్ని మాత్రమే ఇస్తున్నందున ఇందులో బేసిక్, డీఏలు ఉండకపోవడంతో గ్రాట్యుటీ లెక్కింపు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాట్యుటీ ఇవ్వడం కుదరనందున టీచర్లకు రూ.2 లక్షల సాయంపై యోచన.  
♦అంగన్‌వాడీ టీచర్‌ రిటైర్మెంటు తీసుకున్న మరుసటి నెల నుంచి ఆసరా పింఛన్‌ ఇవ్వాలి. 
♦రిటైర్మెంటు తీసుకున్న అంగన్‌వాడీ టీచర్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అంగన్‌వాడీలో ఉపాధి అవకాశాన్ని కల్పించాలి. 
♦అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.లక్ష సాయంతో పాటు ఇతర అంశాల్లో అంగన్‌వాడీ టీచర్‌కు అమలు చేసే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 

ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా ప్రతిపాదనలను తయారు చేసినట్లు సమాచారం. వీటిని మరింత లోతుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించాలని ఈ శాఖ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ముఖ్యమంత్రితో సమావేశమై ప్యాకేజీ ఖరారు అయ్యేలా విశదీకరించాలని భావిస్తున్నారు. వచ్చే నెలాఖరులో సీఎం అపాయింట్‌మెంట్‌      తీసుకోవాలని మంత్రి భావిస్తున్నట్లు పేషీ వర్గాలు చెబుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top