
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. పే స్కేల్ అమలుతోపాటు కచ్చితమైన పని గంటల నిర్ణయం, కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.
శుక్రవారం ఈ మేరకు సీఎంకు సంజయ్ ఒక బహిరంగ లేఖ రాస్తూ పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ గూండాల దాడులు జరగడం బాధాకరమన్నారు. పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారుల వేధింపులు నిత్యకృత్యంగా మారడం దారుణమన్నారు. వారిలో మనోధైర్యం నింపి ఉద్యోగ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదన్నారు.