సిరిసిల్లలో రెడీమేడ్‌ దుస్తుల పరిశ్రమ | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో రెడీమేడ్‌ దుస్తుల పరిశ్రమ

Published Sat, Feb 26 2022 2:08 AM

Readymade Garments Firm Texport To Set Up Plant In Sircilla Apparel Park - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ శివారులో 63 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తెలంగాణ అపారెల్‌ పార్కులో దుస్తుల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్‌పోర్ట్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వేలాది మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా వస్త్రోత్పత్తి, ఎగుమతుల కోసం బిల్ట్‌ టు సూట్‌ పద్ధతిలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ అపారెల్‌ పార్కు’ను అభివృద్ధి చేస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న టెక్స్‌పోర్ట్‌ కంపెనీ 1978 నుంచి అపారెల్‌ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, విదేశీ ఎగుమతులు లక్ష్యంగా రెడీమేడ్‌ దుస్తులను తయారు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 19 చోట్ల రెడీమేడ్‌ తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రూ.620 కోట్ల వార్షికాదాయంతో ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. 

రెండు వేల మందికి ఉపాధి 
ప్రస్తుత ఒప్పందం మేరకు సిరిసిల్లలోని తెలంగాణ అపారెల్‌ పార్కులో 7.42 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ శైలజ రామయ్యర్, టెక్స్‌పోర్ట్‌ ఎండీ నరేంద్ర డి.గోయెంకా సంతకాలు చేశారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ అభివృద్ధికి, టెక్స్‌టైల్‌ రంగంలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. సిరిసిల్లలోని నేతన్నల నైపుణ్యం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అపారెల్‌ పార్కులో ఫ్యాక్టరీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని టెక్స్‌పోర్ట్‌ కంపెనీ ఎండీ గోయెంకా తెలిపారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement