బూతులు మాట్లాడనంటే చర్చకు వస్తా: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Ready For Discussion With KCR On Paddy Procurement Says Central Minister Kishan Reddy - Sakshi

అమరులస్తూపం వద్ద అయితే ఓకే 

బూతుమాటల్లో ఆయనదే గెలుపని వ్యాఖ్య 

సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీనియర్‌ విలేకరుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను చర్చకు సిద్ధమని, బూతులు మాట్లాడకుండా, నాగరిక భాష మాట్లాడతానంటేనే వస్తానని పేర్కొన్నారు. కేసీఆర్‌తో బూతుల్లో తాను పోటీపడలేనని, ఓటమిని ముందే అంగీకరిస్తున్నానని తెలిపారు.

పార్లమెంట్‌ సమావేశాలు లేనప్పుడు ఎప్పుడు హైదరాబాద్‌ రమ్మన్నా వస్తానని చెప్పారు. ఒక రైతుబిడ్డను అయిన తాను కేంద్రమంత్రి కావడం కేసీఆర్‌కు నచ్చలేదేమోనని అన్నారు. ‘నాపై కేసీఆర్‌ చేస్తున్న దూషణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కేసీఆర్‌ అసభ్య పదజాలం ఉపయోగించవచ్చా.. విమర్శించడానికి మాటల్లేవా..’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఎన్నికల ప్రభావం వారిపై ఉందని గత కొన్ని రోజులుగా తాను చెప్తున్నానని, అభద్రతా భావం ఉన్నదునే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని, ఆ మాటలను చూస్తుంటే ఆయన అభద్రతాభావంలో ఉన్నట్టు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తిట్లకు భయపడే వ్యక్తిని కాదని, తాను దేశం ముఖ్యమనుకుని పనిచేసే వ్యక్తినని పేర్కొన్నారు.  

రైతులకు ధైర్యమిస్తున్నాం... 
రైతులు అంగట్లో, రోడ్లపై ధాన్యం పోసి రెండు నెలల నుంచి ఎదురుచూస్తున్నారని, వారికి ధైర్యమిచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. చివరి బస్తా వరకు కొనుగోలు చేస్తామని చెప్పానని, తానేమీ కేసీఆర్‌ను తిట్టడం కోసం ప్రెస్‌మీట్‌ పెట్టలేదని స్పష్టం చేశారు. ‘ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమని ఎక్కడైనా చెప్పిందా.. ఏదైనా ప్రకటన చేసిందా..  ఎందుకు రైతులను గోస పెడుతున్నారు..’ అంటూ కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యామ్నాయ రకాలైన విత్తనాలను ఉపయోగించి రబీలో కూడా వరిసాగు చేయవచ్చని,  ఆంధ్రాలో సీడ్‌ మార్చుకుని, వేరే రకం సాగు చేస్తున్నారు. మిల్లర్లు టెక్నాలజీ మార్చుకునే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. వారికి అవసరమైన సాయం అందించాలి’ అని సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top