ఐదోరోజు పరమేష్టి, వైభవేష్టి హోమం | Sakshi
Sakshi News home page

ఐదోరోజు పరమేష్టి, వైభవేష్టి హోమం

Published Mon, Feb 7 2022 4:01 AM

Ramanujacharya: Sri Rama Nagari Thrilled With Ashtakshari Mantra On Fifth Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌:  శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ఆదివారం ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. ఉదయం అష్టాక్షరీ మంత్ర పఠనంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. తర్వాత లక్ష్మీనారాయణ మహాయాగంలో భాగంగా పరమేష్టి, వైభవేష్టి హోమాన్ని చినజీయర్‌ స్వామి సారథ్యంలోని రుత్వికులు నిర్వహించారు.

మానవుడికి కలిగే కొన్ని రకాల రుగ్మతలకు ఎలాంటి మందులు లేవని.. భగవన్నామ స్మరణ, జపం ద్వారా అలాంటి రుగ్మతలను జయించడమే పరమేష్టి ఉద్దేశమని, పితృదేవతలను సంతృప్తిపరుస్తూ వారి అనుగ్రహాన్ని పొందడమే వైభవేష్టి ఉద్దేశమని రుత్వికులు వెల్లడించారు. 115 యాగశాలల్లోని 1,035 యజ్ఞ కుండాల వద్ద వేదమంత్రోచ్ఛరణల మధ్య ఈ హోమం జరిగింది. తర్వాత మూలమంత్ర హవనం, 108 తర్పనం, 28 పుష్పాంజలి, చివరిగా పూర్ణాహుతి నిర్వహించారు. అదే సమయంలో ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామావళి, శ్రీరంగనాథ భగవానుడి పూజ జరిగాయి.  

ప్రవాస విద్యార్థులతో అవధానం 
అమెరికాలో ప్రజ్ఞ కోర్సు ద్వారా శిక్షణ పొందిన ఎనిమిది మంది ప్రవాస భారతీయ విద్యార్థులతో చినజీయర్‌ స్వామి చేపట్టిన అవధాన కార్యక్రమం భక్తుల్ని మంత్రముగ్ధులను చేసింది. ప్రవచన మండపంలో జరిగిన ఈ అవధానాన్ని భగవద్గీత శ్లోకాలతో మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరిగా.. ప్రతి శ్లోకం చివరి అక్షరంతో మొదలయ్యే మరో శ్లోకాన్ని అందుకుంటూ, దాని అర్థాన్ని వివరిస్తూ వచ్చారు. కార్యక్రమం అనంతరం ప్రవాస విద్యార్థులు అభిరాం, అముక్త మాల్యద, అనిరుధ్, కోవిద, మహేశ్వరి, మాధవప్రియ, వేద, శ్రీలతలను చినజీయర్‌ స్వామి ఆశీర్వదించి, సమతామూర్తి ప్రతిమలను బహుకరించారు. 

కిటకిటలాడిన శ్రీరామనగరం 
శంషాబాద్‌: ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని సమతామూర్తి భారీ విగ్రహాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు, సందర్శకులతో ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది తరలివచ్చారు. వారిని భద్రవేదికపై ఆశీనులైన ప్రధాన విగ్రహం వరకు క్యూలైన్‌లో అనుమతించారు.  హైకోర్టు న్యాయమూర్తులు పోనగంటి నవీన్‌రావు, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, రాజస్థాన్‌ పుష్కార్‌ జగద్గురు స్వామి రామచంద్రాచార్య మహారాజ్, బిహార్‌లోని గయకు చెందిన జగద్గురు శ్రీస్వామి వెంకటేశ ప్రపంచార్యాజీ మహారాజ్, సిక్కిం ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ వీసీ జగన్నాథన్‌ పట్నాయక్‌ తదితరులు కూడా సమతామూర్తిని దర్శించుకున్నారు. మొత్తంగా ఆదివారం ఒక్కరోజే దాదాపు లక్ష మంది వచ్చినట్టు అంచనా వేశారు. 

నేటి కార్యక్రమాలివీ.. 
సోమవారం రోజున యాగశాలలో దృష్టి దోష నివారణకు సంబంధించిన వైయ్యూహి కేష్టి యాగాన్ని నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి మూలమైన శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ జరుగనుంది. వీటితోపాటు పలువురు ప్రముఖుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  

Advertisement
Advertisement