
ఇప్పటికే రెండు దశల్లో ప్రవేశపెట్టిన రైళ్లు
దక్షిణమధ్య రైల్వేకు మాత్రం మొండిచేయి
తాజాగా అమృత్‌భారత్ 3.0 వెర్షన్ తయారీ
హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తక్కువ చార్జీ..ఎక్కువ వేగంతో ప్రయాణ సదుపాయం అందించే సామాన్యుడి రైలే అమృత్‌భారత్ ట్రైన్. ఇప్పటివరకు రెండు దశల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టారు. అయితే దక్షిణమధ్య రైల్వేలో మాత్రం ఒక్క అమృత్‌భారత్ కూడా పట్టాలెక్కలేదు. ‘అమృత్ భారత్ 1.0’, ‘అమృత్‌భారత్ 2.0’శ్రేణుల తర్వాత ఇప్పుడు తాజాగా ‘అమృత్ భారత్ 3.0’వెర్షన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది.
ఇటీవల స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా కూడా అమృత్ భారత్ 3.0 ప్రస్తావనకు వచ్చింది. ఈ కొత్త వెర్షన్‌లో ఏసీ, నాన్ ఏసీ సదుపాయం ఉన్న రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికైనా హైదరాబాద్ కేంద్రంగా ఈ సామాన్య ప్రయాణికుల రైలును పట్టాలెక్కిస్తారా..లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
» హైదరాబాద్ నుంచి పటా్న, వారణాసి, షిరిడీ తదితర ప్రాంతాలకు భారీ డిమాండ్ ఉంది.
» సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్టణం, కాకినాడ మార్గాల్లో అన్ని రెగ్యులర్ రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగలు, వరుస సెలవులతో నిమిత్తం లేకుండా వందల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంటోంది. కొత్తగా రానున్న మూడో వెర్షన్ అమృత్‌భారత్ రైళ్లను హైదరాబాద్ కేంద్రంగా అందుబాటులోకి తేవాలని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఒక్క రైలు కూడా రాలేదు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2023లో అమృత్‌భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. మధ్యతరగతి, పేద ప్రజలు, వలస కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్ల చార్జీలను రూపొందించారు.
» ఏసీ సదుపాయం లేని అమృత్‌భారత్ రైళ్లలో 11 జనరల్ క్లాస్ కోచ్‌లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, ఒక ప్యాంట్రీ కార్, మరో రెండు సెకండ్ క్లాస్–కమ్–లగేజ్–కమ్–గార్డ్ వ్యాన్‌లు, దివ్యాంగులకు ఒక కంపార్ట్‌మెంట్ ఉంటుంది.
» తాజాగా చెన్నై ఐసీఎఫ్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్న అమృత్‌భారత్ 3.0 వెర్షన్ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
» ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో అమృత్‌భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అందులో 6 అమృత్ భారత్ రైళ్లు బిహార్‌కే కేటాయించారు. ఆ రాష్ట్రంలోని మోతీహరి, పటా్న, దర్భంగా, సీతామర్హి తదితర నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తున్నాయి.
» మరో రెండు అమృత్ భారత్ రైళ్లు పశ్చిమబెంగాల్‌లోని మాల్డా టౌన్ నుంచి, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో (గోమతినగర్) నుంచి 2 అమృత్ భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
» ముంబయి, బెంగళూరుకు కూడా ఒక్కొక్క అమృత్‌భారత్ రైళ్లను కేటాయించారు.
» తెలంగాణ రాష్ట్రం మీదుగా ఒక అమృత్‌భారత్ రైలు కూడా అందుబాటులో లేదు. హైదరాబాద్ నుంచి బిహార్‌కు ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది.
» సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల రూట్‌లో ప్రయాగ్‌రాజ్, వారణాసి మీదుగా పట్నా వరకు అమృత్‌భారత్ సూపర్‌ఫాస్ట్ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తెస్తే వలస కార్మికులతోపాటు వారణాసి, ప్రయాగకు వెళ్లే భక్తులకు సైతం ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
» ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి దానాపూర్ పట్నా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఈ రూట్‌లో రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రతి రోజు వందలాది మంది వెయిటింగ్ లిస్ట్‌లోనే పడిగాపులు కాస్తున్నారు.
తెలంగాణ సంపర్క్ క్రాంతి ఏదీ?
ప్రతి రాష్ట్ర రాజధాని నుంచి న్యూఢిల్లీకి సంపర్క్‌క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపర్క్‌క్రాంతి రైళ్లను ప్రవేశపెట్టలేదు. ప్రస్తుతం తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. తెలంగాణ సంపర్క్‌క్రాంతిని నడపాలని ప్రయాణికులు, ప్రయాణికుల సంఘాలు రైల్వే వినియోగదారుల సమావేశాల్లో ప్రతిపాదించారు. విజ్ఞప్తులు చేశారు. ఎంపీల సమావేశంలోనూ ప్రతిపాదనలొచ్చాయి. కానీ రైల్వేశాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు.