Karimnagar: బల్దియా కమిషనర్, కార్పొరేటర్ల మధ్య కొత్త వివాదం

Protocol Issues In Karimnagar Muncipal  Corporation - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ నగర పాలక సంస్థలో కొత్త వివాదం మొదలైంది. కమిషనర్‌ వల్లూరి క్రాంతి, అధికార టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల మధ్య అంతరం పెరిగింది. తమకు కనీస గౌరవం కూడా ఇవ్వని కమిషనర్‌ క్రాంతిని బదిలీపై పంపించాలని 32 మంది టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సంతకాలతో మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం అందజేయడం కొత్త చర్చకు దారితీసింది. కౌన్సిల్‌లో ఉన్న 40 మంది టీఆర్‌ఎస్‌ సభ్యుల్లో సీనియర్లు 8 మంది మినహా 32 మంది కమిషనర్‌ క్రాంతిని బదిలీపై పంపించాలని మంత్రి కమలాకర్, మేయర్‌ సునీల్‌రావుకు విన్నవించడం గమనార్హం.

తమకు గౌరవం ఇవ్వడం లేదనే సాకుతోనే కార్పొరేటర్లు కమిషనర్‌ బదిలీకి ఎసరు పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే జిల్లా కలెక్టర్‌ శశాంక బదిలీ కాగా, ఆయన స్థానంలో ఆర్‌వీ కర్ణన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్‌లలో ఒకటైన కరీంనగర్‌ కమిషనర్‌ను మాత్రం మార్చలేదు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు కరీంనగర్‌ కమిషనర్‌ను కూడా మార్చాలని కోరుతుండడం గమనార్హం. 

ఐఏఎస్‌ అధికారి కావడంతో...
కరీంనగర్‌ కార్పొరేషన్‌కు గతంలో గ్రూప్‌–1 అధికారులు కమిషనర్లుగా వ్యహరించేవారు. మొన్నటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన కె.శశాంక తొలి ఐఏఎస్‌ కమిషనర్‌గా వ్యవహరించారు. ఆయన బదిలీ తరువాత మళ్లీ గ్రూప్‌–1 అధికారులనే నియమిస్తూ వచ్చినప్పటికీ, ఏడాది క్రితం ఐఏఎస్‌ అధికారి వల్లూరి క్రాంతి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి, స్మార్ట్‌సిటీ పనుల విషయంలో కమిషనర్‌గా నిబంధనల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. క్రాంతి వచ్చినప్పటి నుంచి కరోనా ప్రభావమే ఉండడంతో పనుల్లో వేగం తగ్గింది. కాంట్రాక్టర్లకు బిల్లుల విషయంలోనూ  ఆలస్యం జరుగుతోంది. పనుల నాణ్యతను బట్టి బిల్లుల మంజూరీకి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు చేపట్టడం కార్పొరేటర్లకు నచ్చడం లేదు.

మొరం పనులతో మొదలై..
కరీంనగర్‌లో విలీనమైన శివారు ప్రాంతాల్లో వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీగా వరద చేరి చెరువుల్లా తయారయ్యాయి. నీట మునిగిన ప్రాంతాల్లో మొరం నింపాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కార్పొరేటర్లు మేయర్, కమిషనర్‌కు విన్నవించారు. అందుకు సమ్మతించిన అధికారులు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అయితే.. టెండర్ల విధానంలో కాకుండా నామినేషన్‌ పద్ధతిలో పనులు కేటాయించాలని కొందరు కార్పొరేటర్లు ప్రతిపాదించి, వెంటనే అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.

నామినేషన్‌ ప్రతిపాదనలను కమిషనర్‌ పక్కన పెట్టడంతో కొందరు కార్పొరేటర్లు సంతకాల సేకరణకు తెరలేపారని సమాచారం. వీటితోపాటు ఇటీవల పట్టణ ప్రగతిలో చేసిన పలు పనులు నాసిరకంగా ఉండడంతో, సదరు కాంట్రాక్టర్లను మందలించి, పూర్తిస్థాయి బిల్లులు కాకుండా, చేసిన పనులకే చెల్లించారని.. తద్వారా అగ్గి రాజకుందని ప్రచారం జరుగుతోంది. కమిషనర్‌ నిర్ణయాలను శివారు ప్రాంతాలకు చెందిన కొందరు కార్పొరేటర్లు చాలాసార్లు మంత్రికి, మేయర్‌కు దష్టికి తీసుకుని వెళ్లినా.. సర్దిచెప్పి పంపించారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో సాగుతున్న పనులు లోపభూయిష్టంగా ఉండడంతో బిల్లులు మంజూరు కాకుండా కమిషనర్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వీటితోపాటు ఉద్యోగుల్లో సైతం జవాబుదారి తనం పెంచేందునకు చర్యలు తీసుకుంటుండడం కూడా నచ్చడం లేదు. 

కార్పొరేటర్‌ భర్తలకు కనీస గౌరవం లేదా..? 
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిపి 60 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, వారిలో సగం అంటే 30 మంది మహిళా కార్పొరేటర్లే. మహిళలు కార్పొరేటర్లుగా గెలిచినా.. ఒకరిద్దరు మినహాయించి మిగతా వారిని ముందుండి నడిపించేది వాళ్ల భర్తలే. ఈ క్రమంలో సాధారణంగా 80 శాతం మంది మహిళా కార్పొరేటర్ల భర్తలే ఆయా డివిజన్‌లలో జరిగే పనులకు కాంట్రాక్టర్లుగా వ్యహరించడం లేక కుటుంబసభ్యుల్లో ఒకరి పేరిట పనులు చేయించడం జరుగుతోంది.

అలాగే.. కమిషనర్, ఇతర అధికారులను కార్పొరేటర్ల భర్తలే కలిసి అభివృద్ధి పనులకు నిధులు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కమిషనర్‌కు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదని, కార్పొరేషన్‌కు వెళ్లినా అపాయింట్‌మెంట్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని మహిళా కార్పొరేటర్ల భర్తలు ‘ఆవేదన’ చెందుతున్నారు. అత్యవసర పనులకు నామినేషన్‌ పద్ధతిలో మంజూరు ఇచ్చేది కమిషనరే కావడంతో కరోనా సమయంలో పట్టణంలోని వార్డుల్లో కోట్లాది రూపాయల పనులు ఇదే పద్ధతిలో జరిగాయి. అయితే.. నామినేషన్‌ మీద జరిగిన పనులను పరిశీలించి బిల్లులు మంజూరు చేయాల్సిన కమిషనర్‌ అనుకూలంగా స్పందించడం లేదని చెపుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top