విరగ‘బడి’ వసూళ్లు! పీపీకి రూ.22 వేలు? బస్సు చార్జీలు 32 వేలు?

Private Schools Charging Higher Fees Rs 22000 For PP Child Nizamabad - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్‌ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు ల్యాబ్, లైబ్రరీ స్పోర్ట్స్, ఇతర ఫీజుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. 

జిల్లాలో.. 
జిల్లాలో ప్రస్తుతం 456 ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా తర్వాత రెండేళ్లకు తెరుచుకున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. ఆర్మూర్‌ నిజామాబాద్, బోధన్, భీమ్‌గల్, డిచ్‌పల్లి వంటి పట్టణాల్లో ఫీజుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పీపీ–1 క్లాస్‌ పిల్లవాడికి నిజామాబాద్‌ నగరంలో అన్ని ఫీజులు కలుపుకొని రూ. 50వేల వరకు ఒక కార్పొరేట్‌ పాఠవాల వసూలు చేస్తోంది.

ఆర్మూర్‌ గ్రామీణ ప్రాంతంలో ఓ కార్పొరేట్‌ పాఠశాల, బోధన్‌ రాకాసిపేట్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాల పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. సర్కార్‌ బడి వైపు పిల్లల్ని చేర్పించాలని ప్రచారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు కార్పొరేట్‌ ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల నియంత్రణ మాత్రం చేపట్టడం లేదు. 
చదవండి👉🏻అసలే కానిస్టేబుల్‌.. ఆపై తులం బంగారమిస్తే డబుల్‌ ఇచ్చారు.. అక్కాచెళ్లెళ్ల మాదిరి!

ఉత్తర్వులు అమలెక్కడ....? 
విద్యాశాఖలో కొన్నేళ్ల ఫీజుల నియంత్రిణ కోసం జీవో.నం. 1ను మొదట విడుదల చేశారు. 2017 ఫిబ్రవరి ప్రొఫెసర్‌ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసిన ప్రభుత్వం జీవో.నం. 1ను అమలు చేస్తూనే ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చని జీవో నం. 46ను విడుదల చేసింది. కాని పది శాతాన్ని పక్కకు పెట్టు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా విద్యాశాఖాధికారి మొదలుకొని ఎంఈవో వరకు ఎవరూ కూడా ప్రైవేట్‌ పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భాలు లేవు. ఫిర్యాదులు వస్తేనే చూస్తామనే ధోరణిలో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

కొందరు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలతో మిలాకత్‌ అయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎటువంటి అడ్మిషన్‌ ఫీజు వసూలు చేయరాదు. జిల్లాలో సగటున ప్రతి ప్రైవేట్‌ విద్యార్థి నుంచి రూ. 1,000 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. హాస్టల్‌ వసతి పేరుతో రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
చదవండి👉🏻పార్కింగ్‌ బాధ్యత యజమానులదే: హైకోర్టు 

ప్రైవేట్‌లో ఫీజుల వివరాలు..

చదువు కంటే బస్సు ఫీజులే ఎక్కువ 
నగరంలో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో బస్సుల ఫీజులు పాఠశాల ఫీజుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్మూర్‌ రోడ్డులో ఉన్న మూడు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఏడాదికి రూ. 32 వేలు బస్సు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ. 20 వేల వరకు ఉన్నాయి. ఇలా విద్యార్థుల ఫీజుల కంటే బస్సు చార్జీలే ఎక్కువయ్యాయి.

భారం మోయలేకపోతున్నాం.. 
పెరిగిన ఫీజుల భారం మోయలేకపోతున్నాం. ప్రైవేట్‌ పాఠశాలలు ఎక్కువగా ఫీజులు పెంచడం సబబు కాదు. తక్షణమే విద్యాశాఖాధికారులు స్పందించాలి. మధ్యతరగతి, పేదవారికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. అసలే కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ ఫీజులను భరించలేకపోతున్నాము.
– మనోజ్, విద్యార్థి తండ్రి గాయత్రి నగర్‌ 

నిబంధనల ప్రకారం వసూలు చేయాలి 
ప్రైవేట్‌ పాఠశాలలు నిబంధనల ప్రకారమే ఫీజులు వసులు చేయాలి. విద్యాశాఖ నిబంధనలు అమలు చేయాలి. లేదంటే పాఠశాలలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. 
– దుర్గాప్రసాద్, డీఈవో  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top