కాసుల కోసం కక్కుర్తి: బిల్లు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తాం!

Private Hospital Did Not Give Corona Dead Body - Sakshi

ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబసభ్యులు  

ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్సీ జోక్యంతో మృతదేహం అప్పగింత 

మలక్‌పేట(హైదరాబాద్‌): ... అయినా ప్రైవేట్‌ ఆస్పత్రుల తీరు మారలేదు. అదే ధోరణి.. కాసుల కోసం అదే కక్కుర్తి.. బకాయి బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని తెగేసి చెప్పింది. మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన, అధికార పార్టీ ఎమ్మెల్సీ చొరవతో ఆఖరికి ఆస్పత్రి యాజమాన్యం దిగొచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... అది దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయూష్‌ ఆస్పత్రి. అందులో ఈ నెల 5న మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన యెర్నం శ్రీధర్‌(37) అనే కరోనా రోగి చేరారు. వైద్యులు 12 రోజులపాటు చికిత్స అందించారు. సోమవారం ఉదయం కూడా శ్రీధర్‌ ఆరోగ్యంగానే ఉన్నారు. కుటంబసభ్యులతో బాగానే మాట్లాడారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఊపిరి వదిలారు.

తమ కుటుంబసభ్యుడు చనిపోయాడనే బాధలో ఉండగానే బిల్లు చెల్లించాలంటూ యాజమాన్యం బాధితులపై ఒత్తిడి చేసింది. చేసేదేమీలేక వారు రూ.8 లక్షలు చెల్లించారు. అయినా మృతదేహాన్ని వారికి అప్పగించలేదు. అదేంటని అడిగితే మరో రూ.3 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే అప్పు చేశామని, ఇక ఏమాత్రం చెల్లించలేమని బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకొని వచ్చిన మలక్‌పేట ఎస్‌ఐ వీరబాబు వారిని సముదాయించారు.

బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్ముకునే విధంగా ఆస్పత్రి యాజమాన్యం రెమిడిసివిర్‌ జంక్షన్లకు ఒక్కో దానికి రూ.50 వేలు, ప్లాస్మాకు రూ.30 వేలు వసూలు చేస్తోందని మృతుడి సోదరుడు, జర్నలిస్టు సుధీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాకుండా ప్రజల ప్రాణాలను అడ్డం పెటుకుని దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్‌ చేయడంతో ఎట్టకేలకు మృతహదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించింది. 

ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు
‘మృతుడి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. బకాయి ఉన్న బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని అనలేదు. మిగిలిన బిల్లు కట్టాలని చెప్పాం. కోవిడ్‌తో బాధపడుతున్న శ్రీధర్‌కు సరైన చికిత్స అందించాం, కార్డియో ఎటాక్‌ కావడం వల్ల మృతి చెందారు’అని ఆయుష్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ ప్రమోద్‌ తెలిపారు. ∙ కాసుల కోసం దిల్‌సుఖ్‌నగర్‌ ఆయూష్‌ ఆస్పత్రి కక్కుర్తి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top