మహేశ్‌ భగవత్, దేవేందర్‌ సింగ్‌లకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్స్‌ | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పోలీసులకు సేవా పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ 

Published Mon, Aug 15 2022 3:08 AM

president police medals for telangana cops Mahesh Bhagwat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌: శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ సేవలు అందించిన 14 మంది రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోంశాఖ పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ హోదాలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న మహేశ్‌ మురళీధర్‌ భగవత్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న దేవేందర్‌ సింగ్‌ చుంగిలను రాష్ట్రపతి పోలీస్‌ మెడల్స్‌కు ఎంపిక చేసింది. మరో 12 మంది పోలీసు అధికారులకు మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలను ప్రకటించింది. పోలీసు బలగాల్లో మంచి పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందికి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ సేవా పతకాలను ప్రకటిస్తుంది. 

మెరిటోరియల్‌ మెడల్స్‌ పొందినది వీరే.. 
మెరిటోరియల్‌ మెడల్స్‌కు ఎంపికైనవారిలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నేర పరిశోధన విభా­గం అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఏఆర్‌ శ్రీనివాస్, సీఐడీ అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయ­ణ, ఎస్‌ఐబీలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ పైళ్ల శ్రీనివాస్, హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఏసీపీ సాయిని శ్రీనివాసరావు, ఖమ్మం ఏసీబీ డీఎస్పీ సూరాడ వెంకటరమణమూర్తి, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఎస్పీ చెరుకు వాసుదేవరెడ్డి, పోలీస్‌ అకాడమీలో డీఎస్పీగా ఉన్న గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం సీఎస్‌బీ ఎస్సై చిప్ప రాజమౌళి, రాచకొండ ఎస్బీ ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్, కామారెడ్డి హెడ్‌క్వార్టర్స్‌ ఏఆర్‌ ఎస్సై జంగన్నగారి నీలంరెడ్డి, మామునూర్‌ బెటాలియన్‌ ఏఆర్‌ ఎస్సై సలేంద్ర సుధాకర్, కరీంనగర్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఉండింటి శ్రీనివాస్‌ ఉన్నారు.

మిగతా యూనిఫాం విభాగాల్లో.. 
 అగ్నిమాపక శాఖ (ఫైర్‌ సర్వీస్‌)లో ఉత్తమ సేవలకు సంబంధించి తెలంగాణకు చెందిన ఇద్దరు మెడల్స్‌కు ఎంపికయ్యారు. లీడింగ్‌ ఫైర్‌మన్లు ఎర్రగుంట వెంకటేశ్వరరావు, ఫరీద్‌ షేక్‌లకు ఫైర్‌ సర్వీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు దక్కాయి. 
 హోంగార్డులు చల్లా అశోక్‌రెడ్డి, చంద్ర సురేశ్, అబ్దుల్‌ షుకూర్‌బేగ్‌లకు హోంగార్డ్స్, సివిల్‌ డిఫెన్స్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు దక్కాయి. 
  జైళ్లశాఖకు సంబంధించి హెడ్‌ వార్డర్‌ వలదాసు జోసెఫ్, చీఫ్‌ హెడ్‌ వార్డర్‌ జె.వీరాస్వామిలకు కరెక్షనల్‌ సర్వీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు దక్కాయి. 

34 ఏళ్ల సర్వీసులో 30 రివార్డులు 
చౌటుప్పల్‌: కేంద్ర మెరిటోరియస్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్‌ను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ అభినందించారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి.. హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై వరకు 34 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాట్రగడ్డ శ్రీనివాస్‌ ఇప్పటివరకు 30 రివార్డులు పొందారు. తాజాగా ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక మెడల్‌కు ఎంపికవడం సంతోషంగా ఉందని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 

మహేశ్‌ భగవత్‌కు మూడోసారి.. 
రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు ప్రతిష్టాత్మక పోలీస్‌ మెడల్స్‌ దక్కడం ఇది మూడోసారి. 2004లో ప్రెసిడెంట్‌ పోలీసు మెడల్‌ ఫర్‌ గ్యాలంటరీ (పీపీఎంజీ), 2011లో పోలీసు మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పురస్కారాలను అందుకున్న ఆయన.. తాజాగా ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. 

ముగ్గురు రైల్వే పోలీసులకు మెడల్స్‌ 
విధుల్లో మంచి ప్రతిభ కనబర్చిన దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళానికి చెందిన ముగ్గురు సిబ్బంది పోలీస్‌ మెడల్స్‌కు ఎంపికయ్యారు. ఇందులో మహబూబ్‌నగర్‌లో ఆర్పీఎఫ్‌ ఎస్సైగా పనిచేస్తున్న సైదా తహసీన్, మౌలాలి రైల్వే రక్షణ దళం శిక్షణ కేంద్రంలో ఏఎస్సై నాటకం సుబ్బారావు, ఇదే శిక్షణ కేంద్రంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి విజయ సారథి ఉన్నారు.

చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం 

Advertisement
 
Advertisement
 
Advertisement