అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం  | Sakshi
Sakshi News home page

అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం 

Published Mon, Aug 15 2022 2:25 AM

azadi ka amrit mahotsav india ready for independence day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలే. ఎవరిని కదిలించినా అమృతోత్సవ సంగతులే. ఊరూ వాడా, పల్లె పట్నం మూడు రంగుల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. స్వాతంత్య్ర సంబరాల ముచ్చట్లతో మురిసిపోతున్నాయి. స్వాతంత్య్ర భానూదయానికి 75 ఏళ్లు పూర్తవుతుండటం ఈసారి పంద్రాగస్టు ప్రత్యేకతను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో దేశమంతా త్రివర్ణ శోభితమైంది. నెలల తరబడి సాగుతున్న స్వాతంత్య్ర అమృతోత్సవాలకు అద్భుతమైన ముగింపు ఇచ్చేందుకు అన్నివిధాలా ముస్తాబైంది.

గోల్కొండ కోటపై జాతీయజెండా ఎగరేయనున్న సీఎం కేసీఆర్‌
దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ సోమవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని చరిత్రాత్మక గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైనా.. దేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉండటాన్ని, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను సీఎం తన ప్రసంగంలో ఎండగట్టే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ముందున్న సవాళ్లు, కర్తవ్యాలు వివరించడంతో పాటు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాధించిన పురోగతిని, భవిష్యత్‌ కార్యక్రమాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

త్రివర్ణ శోభితమైన గోల్కొండ కోట
కాగా రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల పెన్షన్లు జారీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొందరు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్‌ స్వయంగా పెన్షన్‌ కార్డులు అందజేసే అవకాశం ఉంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం ఖైదీలు విడుదల కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం గోల్కొండ కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మిగతా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు.   


త్రివర్ణ శోభితమైన చార్మినార్‌
చదవండి: స్వతంత్ర భారత సందేశం

Advertisement

తప్పక చదవండి

Advertisement