
సస్పెండ్ చేయిస్తా, మీకు ప్రొటోకాల్ తెలియదా..?
ట్రాఫిక్ పోలీసులపై మంత్రి పొన్నం ఆగ్రహం
హైదరాబాద్: మంత్రి కారు ఎక్కడ పెట్టాలో కూడా మీరు చెప్తారా..? మీ సీఐ ఎవరు పిలవండి... సస్పెండ్ చేయిస్తా ఏమనుకుంటున్నారో..? నేనేమైనా కారును అడ్డంగా పెట్టానా కామన్ సెన్స్ లేదా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ ఎస్‌ఐ రామ్ మనోహర్‌తో పాటు, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులపై రుసరుసలాడారు. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం బంజారాభవన్‌లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో మంత్రి కారు డ్రైవర్ భవన్ గేటు ఎదుట కారును ఆపాడు. కారు అడ్డుగా ఉందని కాస్తా పక్కకు తీయాలని బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ సాయి ప్రకాశ్ డ్రైవర్‌కు సూచించాడు. మంత్రిగారు కారు ఇక్కడే పెట్టమన్నారని మేము ఇలాగే పెడతామని డ్రైవర్ చెప్పడంతో ట్రాఫిక్ సీఐకి డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సీఐ కారును పక్కకు పెట్టించారు.
కార్యక్రమం ముగించుకుని బయటికి వచ్చిన మంత్రికి వారు ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన అక్కడే విధుల్లో ఉన్న అడిషనల్ డీసీపీ గోవర్ధన్‌ను పిలిచి మాట్లాడారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్‌ఐ రామ్ మనోహర్‌ను పిలిచి మందలించారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సస్పెండ్ చేయిస్తా, సస్పెండ్ చేయించే వరకు ఇక్కడి నుంచి కదలనంటూ మంత్రి అధికారులకు ఫోన్ కలిపారు. ఇంతలోనే కిందికి వచ్చిన ఎమ్మెల్యే దానం అధికారులకు, మంత్రికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించారు.