బీసీ కోటాపై ఢిల్లీకి.. | ponnam prabhakar demands resignation of telangana mps over 42 pc bc reservation | Sakshi
Sakshi News home page

బీసీ కోటాపై ఢిల్లీకి..

Jul 29 2025 6:14 AM | Updated on Jul 29 2025 7:47 AM

ponnam prabhakar demands resignation of telangana mps over 42 pc bc reservation

5, 6, 7 తేదీల్లో హస్తిన కేంద్రంగా కార్యాచరణ 

42 శాతం రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఒత్తిడి.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం 

వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

5న పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం 

6న మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చలో ఢిల్లీ.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా 

7న రాష్ట్రపతితో భేటీ..బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుల ఆమోదానికి విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్టు 6న రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని, జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించింది.

7న ముఖ్యమంత్రితో పాటు మంత్రు లు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున బీసీల రిజర్వేషన్ల బిల్లు ల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసన తెలిపేందుకు ఆగస్టు 5న పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని తీర్మానించింది. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది.  

బీసీ మంత్రుల విలేకరుల సమావేశం.. 
బీసీలకు స్థానిక సంస్థల్లో అలాగే విద్యా, ఉద్యోగావకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రతిపాదించిన రెండు బిల్లులను గత మార్చి 17న రాష్ట్ర శాసనసభ, మార్చి 18న శాసనమండలి ఆమోదించాయి. ఈ రెండు బిల్లులను మార్చి 22న రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించగా, ఆయన మార్చి 30న రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. అయితే రాష్ట్రపతి వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు.

మరోవైపు 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఇటీవల ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు.. ఈ నెలాఖరులోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలంటూ గడువు విధించింది. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులతో స్థానిక సంస్థల ఎన్నికలు ముడిపడి ఉండడంతో వాటి సాధన కోసం ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెంచాలని, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కాగా కేబినెట్‌ భేటీ తర్వాత..బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌.. సహచర బీసీ మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి క్లుప్తంగా వివరాలు వెల్లడించారు.  

కేసీఆర్‌ తీరని ద్రోహం చేశారు 
‘లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలతో పాటు 100 మందికి పైగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్తారు. తెలంగాణలోని బీసీ మేధావులు, కుల సంఘాల నాయకులు కూడా ఢిల్లీకి తరలిరావాలి. గతంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే నిబంధనను 2018లో తెచి్చన పంచాయతీరాజ్‌ చట్టంలో పొందుపరిచి బీసీలకు తీరని ద్రోహం చేశారు. ఈ చట్టం బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారింది. రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేసేందుకు పంచాయతీరాజ్‌ చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని గత జూలై 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి, 14న గవర్నర్‌ ఆమోదం కోసం పంపించాం.

ఆ ఆర్డినెన్స్‌ ఫైలును సైతం రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్‌ పంపించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులు, ఆర్డినెన్స్‌ను తక్షణమే ఆమోదించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయటంతో పాటు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో జాతీయ స్థాయిలో అవసరమైన కార్యాచరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది..’అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

రవాణా శాఖ చెక్‌ పోస్టులు రద్దు 
రవాణా శాఖకు సంబంధించి రాష్టంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఇలాంటివి మొత్తం 15 చెక్‌ పోస్టులు ఉన్నాయి. అయితే జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్‌ పోస్టులను తొలిగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇకపై సిబ్బందితో కాకుండా వాహన్, అడ్వాన్స్‌డ్‌ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది.  

అన్నిచోట్లా మైక్రో బ్రూవరీస్‌ 
కోర్‌ తెలంగాణ అర్బన్‌ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మైక్రో బ్రూవరీస్‌ చట్టానికి పలు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

బీజేపీ నేతలు సహకరించాలి 
‘బిల్లులు, ఆర్డినెన్స్‌ రాష్ట్రపతి ఆమోదించేలా రాష్ట్రంలోని కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, అరవింద్, ఈటల రాజేందర్, కృష్ణయ్య, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ప్రయతి్నంచాలి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా బిల్లులకు ఆమోదముద్ర పడేలా సహకరించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 

అయితే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఇందిరా సాహ్నీ కేసులో ఇచి్చన తీర్పులోనే.. శాస్త్రీయ సమాచారం ఆధారంగా ఆ పరిమితి దాటవచ్చని కూడా పేర్కొంది. పక్కాగా నిర్వహించిన సర్వే ఆధారంగానే మేము బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నాం. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్‌ కోటాతోనే 50 శాతం క్యాప్‌ పోయింది. ఇప్పుడు 64 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య నాయకత్వం వహించి ఢిల్లీకి రావాలి. ఆయన ఈ విషయంలో మౌనం వీడాలి. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇస్తే మంచిది. లేకుంటే సామ, భేద, దాన దండోపాయాలను ఉపయోగిస్తాం..’అని మంత్రి చెప్పారు.  

ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే..!
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్‌లో విస్తృత చర్చ 
ఆగస్టు 7 వరకు పోరాటం.. ఆ తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం 
పట్టణ గృహ నిర్మాణ పాలసీపై కూడా చర్చించిన మంత్రిమండలి 
నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలకు ఆమోదం 

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని, ప్రతిపక్షాలు చేస్తున్న దు్రష్పచారాన్ని బీసీ వర్గాల ప్రజలు విశ్వసించడం లేదని అభిప్రాయపడింది. సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, మంత్రిమండలి ఆమోదించిన ఆర్డినెన్స్‌ అమల్లోకి రావడానికి ఉన్న అవకాశాలపై మంత్రిమండలి విస్తృతంగా చర్చించింది.  

హైకోర్టును మరింత గడువు కోరే యోచన 
జాతీయ స్థాయిలోని రాజకీయ పారీ్టల సహకారం తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించిన మంత్రివర్గం.. ఆగస్టు 7వ తేదీ తర్వాత మరింత స్పష్టంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి వచి్చన అనంతరం అవసరమైతే 10వ తేదీ తర్వాత మరోమారు మంత్రివర్గం సమావేశమై చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. కేంద్రం నుంచి వచ్చే స్పందనను బట్టి స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టును మరికొంత గడువు కోరాలనే చర్చ కూడా వచి్చనట్టు సమాచారం.  

హౌసింగ్‌ పాలసీ ఎలా? 
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాల్సిన హౌసింగ్‌ పాలసీ గురించి కూడా మంత్రిమండలి చర్చించింది. ఈ విషయంలో ఎదురవుతున్న సమస్యల గురించి మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో జీ ప్లస్‌ 3 విధానం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా చర్చించిన కేబినెట్‌.. ఈ పాలసీ గురించి స్పష్టమైన నోట్‌ తయారు చేయాలని సంబంధిత ఆధికారులను ఆదేశించింది. నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా కేబినెట్‌ చర్చించింది. బుగ్గమాదారం, ముక్తేశ్వరపురం లిఫ్టులతో పాటు మరి కొన్నింటికి సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement