
వచ్చే శాసనసభ సమావేశాల్లోనే బిల్లు
మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే యోచన
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించకుండా, వ్యాపార ఒప్పందాల విషయంలో పారదర్శకత ఉండేలా రాష్ట్రంలో కొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా భారతీయ స్టాంపుల చట్టాన్ని అనుసరించి వచ్చే శాసనసభ సమావేశాల్లోనే తెలంగాణ స్టాంపుల చట్టం సవరణ బిల్లు–2025ను ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ సవరణ బిల్లుపై శనివారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్, న్యాయ వ్యవహారాల కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హన్మంతులు పాల్గొన్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో ఇందుకు సంబంధించి తెచ్చిన బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం, వాటిని నివృత్తి చేసిన తర్వాత కూడా తిప్పి పంపిన విషయాన్ని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన పొంగులేటి.. 2021లో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకుని, ప్రస్తుత కాలానికి అనుగుణంగా 2025 బిల్లును తీసుకువస్తామని చెప్పారు. కొత్త విధానం పకడ్బందీగా ఉండేలా బిల్లును రూపొందించాలని అధికారులను కోరారు.
భూముల ధరల సవరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి
సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా రాష్ట్రంలో భూముల ధరలను సవరించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరలను సవరించేందుకు, హేతుబద్ధంగా పెంచేందుకు ఉన్న అవకాశాలపై లోతైన అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం ఎన్నో చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే ఆలోచన చేయాలని, కొత్త వాటితో పోలిస్తే పాత అపార్ట్‌మెంట్‌లకు కొంత వెసులుబాటు ఉండేలా ప్రతిపాదనలు చేయాలని సూచించారు. అన్ని అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.