
సైబరాబాద్ డీసీపీ కొడుకు మోహన్ అరెస్టు.. ఇప్పటికే పోలీసుల అదుపులోఓ ఎస్‌ఐబీ ఓఎస్డీ కుమారుడు
మల్నాడు కిచెన్ యజమాని,డ్రగ్ పెడ్లర్ సూర్యతో వీరికి లింకులు
దర్యాప్తులో గుర్తించిన సైబరాబాద్ ఈగల్ టీం
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు వారి కొడుకులే డ్రగ్స్ పెడ్లర్లుగా దందా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఓ డీసీపీ కుమారుడు మోహన్‌ను డ్రగ్స్ కేసులో సైబరాబాద్ ఈగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ వింగ్ (ఎస్‌ఐబీ) ఓఎస్డీ కొడుకు రాహుల్‌తేజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
ఇటీవల అరెస్టయిన కొంపల్లిలోని మల్నాడు కిచెన్ యజమాని, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ సూర్య అమ్మినేని సెల్‌ఫోన్ కాల్ డేటా, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా.. వీరికి సూర్యతో సత్సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్న ఈగల్ బృందం వాటిని విశ్లేíÙస్తోంది. వీరికి ఎంతమంది సెలబ్రిటీలు, ప్రముఖులతో లింక్‌లు ఉన్నాయో ఈగల్ పోలీసులు రట్టు చేసే పనిలో పడ్డారు.
గుట్టు రట్టయిందిలా..
డ్రగ్స్ కేసులో సూర్యతో సహా అరుగురిని అరెస్టు తర్వాత పోలీసులు వారి నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు. సాంకేతిక ఆధారాలను ముమ్మరం చేయగా ఈ క్రమంలో ఎస్‌ఐబీ అధికారి కొడుకు రాహుల్‌తేజ పాత్ర తెరపైకి వచ్చింది. డ్రగ్స్ వ్యవహారంలో తేజ పాత్రపై లోతుగా దర్యాప్తు చేయగా, మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. గతేడాది జనవరిలో డ్రగ్స్ కేసులో నిజామాబాద్ పోలీసులు నాగ్‌పూర్–హైదరాబాద్ మార్గంలో కొకైన్, ఎండీఎంఏ రవాణా చేస్తుండగా విక్రం, ఖాజా మొహిద్దీన్‌లను పట్టుకున్నారు.
వీరిని విచారించగా.. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందిన ప్రధాన మాదక ద్రవ్యాల సరఫరాదారులకు తేజనే నిందితులకు పరిచయం చేశాడని ఆ ఇద్దరూ అంగీకరించారు. దీంతో నిజామాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లోనూ ఏ–3గా తేజ పేరును చేర్చారు. కానీ, ఎప్పుడూ అరెస్టు చేయలేదు. పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. తేజ హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌ను సైతం నడుపుతున్నాడు.
ముందస్తు బెయిల్ కూడా లేదు..
రాహుల్‌తేజ ఎస్‌ఐబీ ఓఎస్డీ కొడుకు కావడంతోనే గతంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయకుండా జాప్యం చేశారనే విషయాన్ని సైబరాబాద్ ఈగల్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులపై న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేసిన నిజామాబాద్ పోలీసులు.. తేజపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇప్పటికే ఏ–3గా తేజ ఉన్నా, కనీసం బెయిల్ లేదా ముందస్తు బెయిల్ కూడా తీసుకోలేదంటే నిందితుడికి పోలీసులు ఎలా సహకరించారో స్పష్టమవుతుందని ఈగల్ అధికారులు అంటున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతడిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అయితే, తాజాగా సూర్య అమ్మినేని కేసులో అరెస్టు చేస్తారా లేదా నిజామాబాద్ కేసులలో అరెస్టు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.