బండి భగీరథ్‌కు మరో షాక్‌ | Police Look Out Notice for Bandi Bhageerath Over Pocso Case | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌కు మరో షాక్‌

May 16 2026 1:22 PM | Updated on May 16 2026 5:59 PM

Police Look Out Notice for Bandi Bhageerath Over Pocso Case

సాక్షి, హైదరాబాద్‌: మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో బండీ భగీరథ్‌కు మరో షాక్‌ తగిలింది. భగీరథ్‌ కోసం పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. హైకోర్టులో మధ్యంతర ఉపశమనం దక్కని నేపథ్యంలో.. శనివారం అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. 

మైనర్‌ బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్‌పై పేట్‌ బషీర్‌బాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు (పోక్సో  చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్‌ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. ఈ క్రమంలో.. 

ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడనుంది. ఈలోపు..

ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదు బృందాలు భగీరథ్‌ కోసం ఢిల్లీ, కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌ను జల్లెడపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నాం సైబరాబాద్‌ పోలీసులు హైదరాబాద్‌లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటు పేట్‌ బషీర్‌బాద్‌ పీఎస్‌ వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. దీంతో ఇవాళో రేపో భగీరథ్‌ను అరెస్ట్‌ చేస్తారని.. తనంతట తానే లొంగిపోతాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.

సెన్సిటివ్‌ కేసు.. ఎలాపడితే అలా కుదరదు: సీఎం రేవంత్‌
ఈ కేసు దర్యాప్తు విషయంలో వస్తున్న విమర్శలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. చర్యలు తీసుకునే ఉద్దేశమే లేకపోతే పోక్సో కేసు ఎందుకు పెడతామని విమర్శకులను ఆయన ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన వే2న్యూస్‌ కాంక్లేవ్‌–2026లో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. 

ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్‌ బాలిక తల్లి ఒకరు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.  ఆ మరుసటిరోజే విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11న సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి భగీరథ్‌ కూడా కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్‌మెంట్‌ను తీసుకొని నోటీసులిచ్చారు. 

బండి భగీరథ్ కోసం ఐదు ప్రత్యేక.. బృందాలతో గాలింపు

ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి భగీరథ్‌ తండ్రికి, బీఆర్‌ఎస్‌ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్‌కి, బండి భగీరథ్‌ తండ్రికి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు. 

ఆ అమ్మాయికి రెండు బర్త్‌ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో ఆ కేంద్ర మంత్రి(సహాయ) తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి అని సీఎం రేవంత్‌ సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement