8 నుంచి సంయుక్త సర్వే! | Sakshi
Sakshi News home page

8 నుంచి సంయుక్త సర్వే!

Published Fri, Nov 4 2022 1:56 AM

Polavaram Project Authority Will Conduct Joint Survey From 8 November - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణ రాష్ట్రంలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఈ నెల 8 నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖలు సంయుక్త సర్వే నిర్వహించనున్నాయి. పోలవరం డ్యాంలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ 150 మీటర్ల మేరకు గరిష్ట స్థాయిలో నీళ్లను నిల్వ చేస్తే బ్యాక్‌వాటర్‌ వల్ల తెలంగాణలో 890 ఎకరాలు, 203 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఇటీవల తెలంగాణ నిర్వహించిన సర్వేలో తేలింది.

మరోవైపు పోలవరం బ్యాక్‌ వాటర్‌తో కిన్నెరసాని నది ఎగువన 18 కి.మీల వరకు, ముర్రెడు వాగు ఎగువన 6 కి.మీల వరకు ముంపు పభ్రావం ఉంటోందని ఇప్పటికే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌రెడ్డి వేసిన కేసు విషయంలో ఎన్జీటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ప్రభావిత ప్రాంతాలను గుర్తించి నిర్థారించడానికి సంయుక్త సర్వే జరపాలని పీపీఏ నిర్ణయం తీసుకుంది.

ఈ రెండు ఉప నదులతో పాటు మరో 34 ఉప నదులు/వాగులపై పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఉండనున్న ప్రభావంపై సర్వే జరపాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఈ ఉప నదుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్‌వాటర్‌ అడ్డంకిగా మారుతోంది. దీంతో ఈ ఉపనదులు/వాగుల్లో ప్రవాహం వెనక్కి తన్నుతుండడంతో పరిసర ప్రాంతాలు ముంపునకు గురి అవుతాయని ఇప్పటికే ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి లేఖలు రాసింది.

పోలవరంతో గోదావరి నది పొడవునా ఉండనున్న  ముంపు ప్రభావంపై సర్వే జరిపించాలని తెలంగాణ కోరుతోంది. వరద రక్షణ గోడల విషయంలో తెలంగాణ డిమాండ్‌ పట్ల పోలవరం అథారిటీ సానుకూలంగా స్పందించింది.. గోదావరికి ఇరువైపులా కరకట్టలు నిర్మించేందుకు కానున్న వ్యయంపై అంచనాలను సమర్పించాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరినట్టు తెలిసింది. సంయుక్త సర్వేలో తేలిన విషయాల ఆధారంగా ముంపు ప్రాంతాల్లోని బాధితులకు పునరావాసం కల్పించే అంశంపై పీపీఏ నిర్ణయం తీసుకోనుంది. 

Advertisement
Advertisement