
సౌకర్యాలకు నోచుకోని భూదాన్ పోచంపల్లి
ప్రతిపాదనలకే పర్యాటకాభివృద్ధి
నిరాశతో వెనుదిరుగుతున్న పర్యాటకులు
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లిని ప్రపంచం మెచ్చినా మన పాలకులు మాత్రం మెచ్చలేదు. యునెస్కో అనుబంధ ప్రపంచ పర్యాటక సంస్థ.. పోచంపల్లికి ఉత్తమ టూరిజం విలేజ్ అవార్డు అందజేసింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఇక్కడ టూరిజం అభివృద్ధికి తీసుకొన్న చర్యలు శూన్యం. రూరల్ టూరిజం కేంద్రంగా పోచంపల్లి సరైన గుర్తింపునకు నోచుకోలేదు. ఈ సంవత్సరం మే 15న.. భూదాన్‌పోచంపల్లిలో 25 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారుల బృందం పర్యటించింది. స్థానిక టూరిజం పా ర్కులో చేనేత ఇక్కత్ వ్రస్తాలతో మోడల్స్‌తో ర్యాంప్‌వాక్ నిర్వహించారు.
మిస్ వరల్డ్ పోటీదారుల రాకతో.. పోచంపల్లి ఇక్కత్‌కు మరింత గుర్తింపు వచ్చి కార్మికుల ఉపాధి మెరుగవుతుందని భావించారు. ప్రచార ఆర్భాటాలే తప్ప, కార్మికుల ఉపాధి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మార్కెట్ మందగించి వ్రస్తాలను కొనుగోలు చేసేవారు లేక మాస్టర్‌వీవర్స్, ఇక్కత్ వస్త్ర వ్యాపారులు దివాలా తీస్తున్నారు. రూ.కోట్ల విలువైన వస్త్రాల నిల్వలు పేరుకుపోతున్నాయి. సహకార సంఘాల నుంచి టెస్కో అరకొర వస్త్రాలను కొనుగోలు చేస్తుండగా, సహకారేతర రంగాల్లోని వ్యాపారులు గిరాకీ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
పేరుకే పర్యాటకం..
2007లో పోచంపల్లి చెరువు సమీపంలో గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రెస్టారెంట్, సరైన వసతి సౌకర్యాలు కల్పించలేదు. దాంతో పోచంపల్లికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గింది. గత ప్రభుత్వ హయాంలో పోచంపల్లిని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మాదిరిగా.. మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్ది, చెరువులో బోటింగ్, చెరువు మధ్యలో ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి, భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే విగ్రహాలను ఏర్పాటు చేసి లేజర్ షో నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వయా పోచంపల్లి మీదుగా యాదగిరిగుట్ట వరకు టూరిజం బస్సులను నడపడం ద్వారా.. పోచంపల్లి పర్యాటకానికి కొత్త ఊపు తీసుకురావాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.
75 దేశాలతో పోటీపడి..
భూదానోద్యమంతో చరిత్ర పుటల్లోకి ఎక్కి, ఇక్కత్ వ్రస్తాల తయారీ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన భూదాన్‌పోచంపల్లికి 2021లో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు అందజేసింది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు వచ్చాయి. గ్రామీణ టూరిజం, అక్కడి ప్రజల జీవన శైలి, సంస్కృతి సంప్రదాయాలను వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేసినందుకు.. మన దేశంలో తెలంగాణ నుంచి పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్‌గా అరుదైన గౌరవం లభించింది.
డిసెంబర్ 2, 2021లో స్పెయిన్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ 24వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తరపున.. స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రెండో కార్యదర్శి సుమన్‌శేఖర్ అవార్డును స్వీకరించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పోచంపల్లిని తిలకించేందుకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లేక నిరుత్సాహంతో వెనుదిరిగి పోతున్నారు. ప్రభుత్వాలు పర్యాటక కేంద్రంలో కనీస మౌలిక వసతులు కల్పించలేదు.
పర్యాటకాభివృద్ధి చేయాలి
జాతీయ రహదారులు, ముఖ్య ప్రదేశాలలో పోచంపల్లి ప్రాధాన్యాన్ని తెలిపే హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. పోచంపల్లిలో చెరువుకట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలి. పర్యాటకులను ఆకర్షించేలా జాతీయ రహదారి నుంచి పోచంపల్లి పట్టణం వరకు రోడ్డు వెంట చేనేత ప్రాధా న్యం తెలిపే స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయాలి. పోచంపల్లి టూరిజం పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దాలి.
– వేముల సుమన్, భూదాన్ పోచంపల్లి
ఇక్కత్‌పై ప్రచారం పెంచాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోచంపల్లి ఇక్కత్ వ్రస్తాలపై ప్రచారం పెంచాలి. టీవీ యాంకర్లు, సెలబ్రిటీలు, హీరోయిన్లను బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమించి వ్రస్తాలను ప్రమోట్ చేయాలి. ఎయిర్‌పోర్టుల వద్ద పోచంపల్లి ఇక్కత్ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. ఇటీవల మిస్‌వరల్డ్ పోటీదారులు రావడం వల్ల పోచంపల్లికి పేరు వచ్చింది తప్ప, వ్యాపారం పెరగలేదు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా మేము నేసిన చీరలను ప్రదర్శిస్తూ అమ్ముకొంటున్నాం.
– రచ్చ సురేశ్, చేనేత వ్యాపారి, భూదాన్ పోచంపల్లి