అతిపెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ అందుబాటులోకి..

PM Narendra Modi Inaugurates 100 MW Floating Solar Project At Ramagundam - Sakshi

వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని

జాతికి అంకితం చేసినట్లు ప్రకటన 

గోదావరిఖని/కందుకూరు: దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌(నీటిపై తేలియాడే) సోలార్‌ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423 కోట్లతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు. అనంతరం జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్‌ టౌన్‌షిప్‌లోని కాకతీయ ఫంక్షన్‌హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

పెద్ద డిజిటల్‌ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన అనంతరం ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌ మాట్లాడుతూ ఈ ప్లాంట్‌ను దశలవారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్‌ థర్మల్‌ ప్రాజెక్టు స్టేజీ–1లో రెండు యూనిట్ల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్‌ రెండోవారంలో ట్రయల్‌కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 

భారత్‌ అగ్రగామిగా నిలవాలి: కిషన్‌రెడ్డి.
విద్యుత్‌ సంస్కరణలతో రానున్న 25 ఏళ్లల్లో విద్యుత్‌ ఉత్పాదనలో ప్రపంచ దేశాల్లోనే మనదేశం అగ్రగామిగా నిలిచేలా ప్రధాని మోదీ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఉజ్వల్‌ భారత్, ఉజ్వల్‌ భవిష్య పవర్‌ 2047 పేరుతో పీఎం మోదీ, కేంద్ర విద్యుత్‌ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల పరిషత్‌ సమావేశ మందిరం నుంచి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సోలార్‌ విద్యుత్‌కు 40 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. బోరుబావులకు ఎలాంటి మీటర్లు పెట్టడం లేదని, అయినా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యల కారణంగా రైతులకు యూరియా బాధలు తప్పాయని చెప్పారు. కార్యక్రమంలో పవర్‌గ్రిడ్‌ ఈడీ రాజేశ్‌ శ్రీవాత్సవ, సీనియర్‌ జీఎంలు హరినారాయణ, జీవీ రావు, పీవీఎస్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top