‘వనస్థలిపురం పోలీసులపై నమ్మకం లేదు’ 

People Says We Have Not Belief On Vanastalipuram Police - Sakshi

ఇన్‌స్పెక్టర్‌ చంద్రకుమార్‌ను రక్షిస్తున్నారని అనుమానం 

 కేసు నమోదై మూడు రోజులైనా ఎలాంటి చర్యలు లేవు 

 ‘సాక్షి టీవీ’తో వాపోయిన వేధింపులకు గురైన అధికారిణి 

సాక్షి, సిటీబ్యూరో : గడిచిన కొన్నేళ్లుగా తనను వివిధ రకాలుగా వేధించిన ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రకుమార్‌ విషయంలో వనస్థలిపురం పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు గురువారం వాపోయారు. ఈ మేరకు ఆమె ‘సాక్షి టీవీ’కి సందేశాలు పంపారు. ఈ ‘ఖాకీ’చకుడిని నగర పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేయగా... నిర్భయ కేసు నమోదైనా వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేయకపోవడం సందేహాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. నగర నిఘా విభాగమైన స్పెషల్‌ బ్రాంచ్‌లో (ఎస్బీ) ఈస్ట్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూ సస్పెన్షన్‌కు గురైన ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రకుమార్‌ తక్షణం అరెస్టు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. సందేశాలు, ఫోన్‌ కాల్స్‌తో పాటు నగ్న వీడియో కాల్స్‌ ద్వారా బాధితురాలి పట్ల హేయంగా ప్రవర్తించిన చంద్రకుమార్‌పై నమోదైన కేసు విషయంలో వనస్థలిపురం పోలీసులు ఆది నుంచి అనుమానాస్పదంగానే ప్రవర్తిస్తున్నారు.(నగ్నంగా వీడియో కాల్స్‌ చేస్తూ సీఐ వేధింపులు..)

ఈ ఇన్‌స్పెక్టర్‌ బాధితురాలు సోమవారం మధ్యాహ్నం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని తొలుత జనరల్‌ డైరీలో (జీడీ) ఎంట్రీ పెట్టిన అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నం.748/2020గా కేసు నమోదు చేశారు. ఇందులో ఐపీసీలోని 354, 354 సీ, 354 డీ, 504, 506, 509 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 67, 67 ఏ సెక్షన్ల కింద ఆరోపణలు పొందుపరిచారు. చంద్రకుమార్‌ వ్యవహారంపై ప్రాథమిక విచారణ చేయించిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అతడిని మంగళవారం సస్పెండ్‌ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. దీంతో పాటు చంద్రకుమార్‌పై వనస్థలిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించారు.

చంద్రకుమార్‌పై సోమవారమే కేసు నమోదైందన్న విషయాన్ని గోప్యంగా ఉంచడానికి వనస్థలిపురం పోలీసుల అధికారులు ప్రయత్నించారు. ఆయన తమ కమిషనరేట్‌ అధికారి కాదని, ఇక్కడ ఎలాంటి కేసులు నమోదు కాలేదంటూ చెప్పి తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. పోలీసులు తప్పు చేసినా తప్పించుకోలేరు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ నగర కొత్వాల్‌ తన ట్విట్టర్‌ ద్వారా చంద్రకుమార్‌ సస్పెన్షన్‌ను బయటపెట్టారు. అయితే ఓ మహిళతో అత్యంత హేయంగా ప్రవర్తించిన చంద్రకుమార్‌పై నమోదైన కేసు విషయాన్ని మాత్రం వనస్థలిపురం పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం.(వనస్థలిపురం ఎసీపీ సస్పెన్షన్‌ కేసు దర్యాప్తు వేగవంతం)

దీనికి తోడు నిర్భయ వంటి కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను వనస్థలిపురం పోలీసులు గురువారం వరకు అరెస్టు చేయకపోవడం బాధితురాలి అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. వరంగల్‌లో పని చేస్తున్న ప్రభుత్వ అధికారిణి అయిన బాధితురాలు గురువారం ‘సాక్షి టీవీ’తో మాట్లాడుతూ... ‘నా వద్ద ఉన్న అన్ని ఆధారాలను డీజీపీ, రాచకొండ సీపీతో సహా అందిరికీ పంపించా. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతామని హామీ ఇచ్చారు. అయితే మూడు రోజులు ఎదురు చూసినా అది జరగలేదు’ అని వాపోయారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top