మాస్క్‌ దెబ్బకు కళ్లకు కొత్త అందాలు 

People More Aware Of Beauty And Hairstyles In Hyderabad - Sakshi

కరోనా కాలంలో సౌందర్యారాధన 

హెయిర్‌ కేర్, హైజీన్‌ కేర్‌ కూడా.. 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా నగరవాసుల్లో సౌందర్య పోషణ పెరిగింది. అందివచ్చిన ఖాళీ సమయం కొత్త అందాలను అందుకోమని ప్రేరేపించింది. మాస్క్‌తో ముఖాన్ని మూసుకోవాల్సి వచ్చినా..  అధరాలు లిప్‌స్టిక్స్‌ అద్దుకుంటూనే ఉన్నాయి.  కళ్లు కొత్త అందాలు సంతరించుకుంటూనే ఉన్నాయి. హెయిర్‌ కేర్, హైజీన్‌ కేర్‌ కూడా పెరిగింది. అత్యధిక సమయం నాలుగ్గోడల మధ్యనే నడిచిపోయింది కాబట్టి.. అందంగా కనపడాలనే ఆసక్తి తగ్గిందని అనుకుంటే అపోహే అంటున్నాయి కాస్మొటిక్‌ బ్రాండ్స్‌ తయారీ సంస్థలు. గతేడాది ఆన్‌లైన్‌ వేదికగా నమోదైన విక్రయాలు దీనినే సూచిస్తున్నాయని ప్రముఖ ఆన్‌లైన్‌ మేకప్‌ ఉత్పత్తుల విక్రయ సంస్థ పర్పుల్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధులు  చెబుతున్నారు. అయితే మార్చి నుంచి జూన్‌ వరకూ కాస్త నిదానించినా.. ఆ తర్వాత రెట్టింపు విక్రయాలు నమోదయ్యాయంటున్నారు.  

సాధారణంగా ఒక తరహా మేకప్‌కు అలవాటైపోయిన తర్వాత అంత త్వరగా దాన్ని మార్చడానికి కార్పొరేట్, ఐటీ తదితర రంగాలకు చెందిన వారు ఇష్టపడరు. అలా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న మేకప్‌ శైలులను మార్చుకునేందుకు అవసరమైన వెసులుబాటును లాక్‌డౌన్, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అందించింది. దీంతో   ప్రయోగాత్మక మేకప్‌ శైలులు అలవాటయ్యాయి. సౌకర్యవంతంగా ఉన్నాయి కదాని అంటిపెట్టుకున్న పాత స్టైల్స్‌ నుంచి బయటకు వచ్చేలా ఈ లాక్‌డౌన్‌ సిటిజనులను ప్రేరేపించింది. అదే కాస్మెటిక్స్‌ రంగానికి మరింత ఊతమిచ్చింది. అన్‌లాక్‌ సమయంలో హెల్త్, వెల్‌నెస్‌ ఉత్పత్తుల్లో 750శాతం పెరుగుదల నమోదైందని సమాచారం. హెయిర్‌ కేర్, హైజీన్‌ కేర్‌ కూడా మంచి సేల్స్‌ సాధించాయి.  
 
మాస్క్‌తో అందమైన ‘చూపు’.. 
మాస్క్‌లు తప్పనిసరి కావడంతో ఐ మేకప్‌కి బాగా డిమాండ్‌ ఏర్పడిందని నగరానికి చెందిన బ్యూటీషియన్‌ కపిల చెప్పారు. ముఖం మొత్తం మీద కళ్లు మాత్రమే బాగా కనిపించే అవకాశం ఏర్పడటంతో నగరవాసులు కంటిని మెరిపించేందుకు విభిన్న రకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారామె. విచిత్రమేమిటంటే.. ఐ మేకప్‌ ఉత్పత్తుల విక్రయాలను ఇది పెంచడంతో పాటు గతంతో పోలిస్తే లిప్‌ స్టిక్స్‌ సేల్స్‌ కూడా చెక్కు చెదరలేదు.  ‘నిమిషానికి 2 లిప్‌స్టిక్స్‌ చొప్పున మేం విక్రయించాం. దాదాపుగా 10లక్షల లిప్‌స్టిక్స్‌ సేల్స్‌ నమోదయ్యాయని’ ఆన్‌లైన్‌ విక్రయసంస్థ ప్రతినిధి చెప్పారు. అలాగే హెల్త్‌కేర్‌ సప్లిమెంట్స్, హెర్బల్‌ టీ ఐటమ్స్, హెయిర్‌ మాస్క్‌లు, ఫేషియల్‌ సెరమ్స్, టోనర్స్‌ కూడా మంచి సేల్స్‌ సాధించాయి. మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్‌ మాత్రం సీజనల్‌ మార్పులకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. 

నేచురల్‌.. ఫుల్‌.. 
కరోనా కాలంలో నేచురల్‌ మేకప్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ ఏర్పడింది. లాక్‌డౌన్‌ ప్రారంభంలో నెమ్మదించిన సేల్స్‌.. అన్‌లాక్‌ నుంచీ అనూహ్యంగా ఊపందుకున్నాయి. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా మొత్తం 750 బ్రాండ్స్, 50వేల ఉత్పత్తులకు పెంచాం. ప్రతి నెలా 300 కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాం. ఈ నెల 3 నుంచి 12 వరకూ ఐ హార్ట్‌ బ్యూటీ పేరిట పర్పుల్‌ డాట్‌ కామ్‌ వేదికగా అతిపెద్ద సేల్స్‌ నిర్వహిస్తున్నాం. 
– నిపుణ్‌ అనేజా, పర్పుల్‌ డాట్‌ కామ్‌. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top