ఇంటికి వస్తున్నానని ఫోన్‌ చేసిన కాసేపటికే కబళించిన మృత్యువు | One Ends Life In hyderabad road accident | Sakshi
Sakshi News home page

ఇంటికి వస్తున్నానని ఫోన్‌ చేసిన కాసేపటికే కబళించిన మృత్యువు

Jun 30 2025 8:10 AM | Updated on Jun 30 2025 8:10 AM

One Ends Life In hyderabad road accident

ఇంటికి వస్తున్నానని ఫోన్‌ చేసిన కాసేపటికే కబళించిన మృత్యువు

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం

మూసాపేట: కాసేపట్లో ఇంటికి వస్తున్నానంటూ ఫోన్‌ చేసి చెప్పిన కుమారుడు.. అంతలోనే చనిపోయాడని పోలీసులు ఫోన్‌ చేయడంతో ఆ తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.   ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌ రాజీవ్‌ నగర్‌కు చెందిన తిరుపతయ్య కుమారుడు సురేష్‌ (24) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. 

కూకట్‌పల్లిలోని ఫ్రెండ్స్‌ వద్దకు వెళ్లి షాపింగ్‌ చేసుకుని వస్తానని శనివారం సాయంత్రం 5 గంటలకు బోడుప్పల్‌ నుంచి బయలుదేరాడు. రాత్రి 10 గంటలకు ఆలస్యం కావడంతో రాత్రి ఫ్రెండ్‌ వద్ద ఉండి ఉదయం వస్తానని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పాడు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు వస్తున్నానంటూ తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరాడు. 5 గంటలకు కూకట్‌పల్లి పోలీసులు ఫోన్‌ చేసి కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద మెట్రో పిల్లర్‌ నెంబర్‌ 839 వద్ద రోడ్డు ప్రమాదంలో మీ కుమారుడు చనిపోయాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement