సీఎం కేసీఆర్‌‌ పుట్టినరోజు సందర్భంగా నేడు కోటి వృక్షార్చన

One Crore Tree Plantation Program On Occasion Of Cm KCR Birthday - Sakshi

గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం.. రాష్ట్రాన్ని పచ్చని వనంగా మార్చేందుకు కృషి 

ఎంపీ సంతోష్‌ పిలుపు మేరకు కదిలిరానున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు 

పాల్గొననున్న ప్రజాప్రతినిధులు

రాష్ట్రంలో బృహత్‌ కార్యానికి తెరలేవనుంది.. ఏటేటా పచ్చదనాన్ని సింగారించుకుంటున్న తెలంగాణకు ‘కోటి వృక్షార్చన’ జరగనుంది.. కొత్త ఆశలు ప్రతిఫలించేలా కోటి మొక్కలు వేళ్లూనుకోనున్నాయి..

సాక్షి, హైదరాబాద్‌: గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా కోటి మొక్కలు నాటనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ మహత్తర కార్యక్రమం చేపట్టనున్నారు. హరితహారంలో భాగమైన ఈ మహత్కార్యం ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కోటి వృక్షార్చన’పేరిట హరిత విప్లవంలో మరో అంకం తీసుకురానున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సరిగ్గా గంట సమయంలో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు  కోటి మొక్కలు నాటి రాష్ట్రాన్ని ఆకుపచ్చని వనం చేయనున్నారు. ఉద్యమ స్ఫూర్తితో సాగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇందులో భాగస్వాములు కానున్నారు. 

ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపుతో..  
‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటాలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆకు పచ్చని తివాచీ పరిచేందుకు ఆయన నడుం బిగించారు. ఇందులో మరింత మందిని భాగస్వామ్యం చేసేందుకు కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు సంస్థాగతంగా ఉన్న దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు. 

పెరిగిన గ్రీన్‌ కవర్‌ 
రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో గ్రీన్‌కవర్‌ 24 శాతం ఉండేది. దీంతో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిచ్చిన సీఎం కేసీఆర్‌.. ‘హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేస్తూ ఆరేళ్లలో 211 కోట్ల మొక్కలు నాటింది. దీంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో 3.67 శాతం గ్రీన్‌ కవర్‌ పెరిగినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. 

మేమూ నాటుతాం..! 
ప్రముఖ నటులు చిరంజీవి, సంజయ్‌దత్, నాగార్జున, మహేశ్‌బాబుతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ‘కోటి వక్షార్చన’కు మద్దతు పలకడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ నలుమూలలా ఉన్న కేసీఆర్‌ అభిమానులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నట్లు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిర్వాహకులు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా ‘వృక్షార్చన’ 
కోటి వృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, పారిశ్రామికవాడలు, విద్యా సంస్థలు తదితర ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు, వివిధ వర్గాలకు చెందిన వారు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌కు చెందిన 50 దేశాల ప్రతినిధులతో మంగళవారం ఎంపీ సంతోష్‌కుమార్‌ సమావేశమయ్యారు. మొక్కలు నాటే వారు వాట్సాప్‌ ద్వారా 9000365000 నంబర్‌కు ఫొటోలు పంపితే.. వారికి ‘వనమాలి’బిరుదు ప్రదానం చేస్తామని తెలిపారు. కాగా, కోటి వృక్షార్చనలో భాగంగా అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్, విప్‌లు తదితరులు బుధవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో మొక్కలు నాటనున్నారు. 

మెగా రక్తదాన శిబిరానికి కేటీఆర్‌ 
తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం తెలంగాణభవన్‌లో జరిగే మెగా రక్తదాన కార్యక్రమానికి పార్టీ వర్కింగ్‌ కేటీఆర్‌ హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మెగా రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు పాల్గొనాల్సిందిగా టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అన్ని దేశాల్లో మొక్కలు నాటాల్సిందిగా టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం సమన్వయకర్త మహేశ్‌ బిగాల, ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి కోరారు. 

బల్కంపేట ఎల్లమ్మకు 2 కేజీల బంగారు చీర 
సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి 2 కిలోల బంగారంతో తయారు చేసిన పట్టుచీరను సమర్పించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నేతృత్వంలో జలవిహార్‌లో జరిగే జన్మదిన వేడుకల్లో కేసీఆర్‌ జీవన ప్రస్థానంపై రూపొందించిన త్రీడీ డాక్యుమెంటరీతో పాటు ఐదు ప్రత్యేక గీతాలను కేటీఆర్‌ విడుదల చేస్తారు., తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నీ విజేతలకు ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి బహమతులు అందజేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top