‘శ్రీశైలం’ బాధితులకు రూ.కోటి సాయం  | Sakshi
Sakshi News home page

‘శ్రీశైలం’ బాధితులకు రూ.కోటి సాయం 

Published Sun, Sep 6 2020 2:34 AM

One Crore Compensation To The Families Of Deceased Electricity Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలంలోని తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్‌ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీఈ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. దీనికి అదనంగా ఒక్కో కుటుంబానికి రూ.75 లక్షల చొప్పున జెన్‌కో సాయం అందిస్తుందని తెలిపారు. దీంతో డీఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందుతుందని ప్రభాకర్‌రావు వెల్లడించారు. అలాగే మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగమివ్వాలని నిర్ణయించామని తెలిపారు. విద్యార్హతలను బట్టి డీఈ, ఏఈల కుటుంబాలకు ఏఈ/పర్సనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్‌ ప్లాంట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం కల్పిస్తామన్నారు.

ఇతర శాఖాపరమైన సాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. ప్రభాకర్‌రావు అధ్యక్షతన శనివారం విద్యుత్‌ సౌధలో జెన్‌కో బోర్డు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా పాల్గొన్నారు. శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ‘ప్రమాదంలో మన తోటి ఉద్యోగులు మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయం. మరణించిన వారిది గొప్ప సాహసం, త్యాగం. వారిని మళ్లీ తీసుకురాలేం. కానీ మానవ మాత్రులుగా సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ ఘట నను ప్రత్యేక అంశంగా పరిగణించి ప్రభుత్వ సాయంతో పాటు జెన్‌కో తరఫున అదనపు సాయం అందించాలని భావిస్తున్నాం’అని ప్రభాకర్‌ రావు సమావేశంలో ప్రకటించగా, బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది.  

విద్యుదుత్పత్తి పునఃప్రారంభానికి కమిటీ..  
ప్రమాదానికి గురైన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభాకర్‌రావు నియమించారు. జెన్‌కో హైడల్, సివిల్‌ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సీఈలు ఇందులో సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుంది.

 
Advertisement
 
Advertisement