నిలువనీడ లేక.. చేరదీసేవారు లేక!

Old People Abandoned By Family Members In Nirmal - Sakshi

వృద్ధ దంపతులను రోడ్డున పడేసిన కరోనా 

గది ఖాళీ చేయించిన యజమాని 

ఊరూరా తిరుగుతూ జీవనం 

నిర్మల్‌లో పండుటాకుల అవస్థలు

నిర్మల్‌: మిట్ట మధ్యాహ్నం.. ఎర్రటిఎండ.. నెత్తిన మూటలు, కాలినడకన, ఖాళీ కడుపున వచ్చి ఓ చెట్టు నీడన ముక్కుతూ, మూలుగుతూ గడుపుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఊరికాని ఊరిలో పడరాని పాట్లు పడుతున్నారు. జీవన మలిసంధ్యవేళ సంచార జీవనం గడుపుతున్నారు. ఇదీ నిర్మల్‌లో ఓ వృద్ధదంపతుల దయనీయస్థితి.

నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం న్యూవెల్మల్‌ గ్రామానికి చెందిన అల్లకుంట లక్ష్మి, లక్ష్మయ్య అనే వృద్ధ దంపతులకు సంతానం లేదు. సొంత ఇల్లు కూడా లేదు. అదే ఊరిలో ఓ గదిలో అద్దెకుండేవారు. లక్ష్మయ్య ఊళ్లోవారి బర్రెలను కాస్తుండగా, లక్ష్మి వ్యవసాయపనులకు వెళ్లేది. వయసు పైబడటంతో ఆయన ఇంటి పట్టునే ఉంటున్నాడు. నెలనెలా వచ్చే రూ.రెండు వేల పింఛన్‌తోనే ఆ దంపతులు ఇన్నాళ్లు బతుకు వెళ్లదీస్తూ వచ్చారు. ఇటీవల గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో యజమాని ఈ వృద్ధ దంపతులుంటున్న గదిని ఖాళీ చేయించాడు. దీంతో తమ బట్టలను సంచులలో సర్దుకుని, వాటిని నెత్తిన పెట్టుకుని రోడ్డెంటా బయలుదేరారు.  

మూడు నెలలుగా పింఛన్‌ వస్తలేదు... 
రెండు, మూడు రోజులు ఆ ఊళ్లో, ఈ ఊళ్లో గడిపా రు. లక్ష్మి బంధువుల ఇళ్లలో వారం ఉన్నారు. అక్కడా పరిస్థితి బాగా లేక మళ్లీ బయటకు వచ్చా రు. ఇరవై రోజుల క్రితం నిర్మల్‌ బస్టాండ్‌ చేరుకున్నారు. అక్కడే ఉంటూ.. ఎవరైనా అన్నదానం చేస్తే తింటూ పూట గడుపుతున్నారు. బస్టాండ్‌ అధికారులు గురువారం బయటకు పంపించడంతో మళ్లీ రోడ్డున పడ్డారు. ఎండలో ప్రధాన రహదారి వెంట నడుస్తూ.. చివరకు ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం వద్ద ఓ చెట్టు కింద ఆగారు. ‘సుట్టాలున్నా.. మా అసుంటి ముసలోళ్లను ఎన్నాళ్లు ఉంచుకుంటరు బిడ్డా..’అని లక్ష్మి వాపోతోంది. మూణ్నెళ్లుగా పింఛన్‌ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అందరూ ఉన్నా.. అనాథగానే!
వర్ధన్నపేట: భర్త ఉన్నాడు.. బంధువులు ఉన్నారు.. దత్తపుత్రుడు ఉన్నాడు. అయినా ఆమె ఎవరూలేని అనాథలా జీవితం గడుపుతోంది.. అనారోగ్యంతో లేవలేని స్థితిలో బతుకుపోరు సాగిస్తోంది. కరోనా అనుమానంతో ఎవరూ దగ్గరకు రావడంలేదు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట 11వ వార్డుకు చెందిన గబ్బెట విజయ, వెంకటేశ్వర్లు దంపతులు. వెంకటేశ్వర్లు విశ్రాంత ఉపాధ్యాయుడు. సంతానం లేకపోవడంతో విజయను వదిలేసిన ఆయన మరో  పెళ్లి చేసుకుని వరంగల్‌లో కాపురం ఉంటున్నాడు.

విజయ ఒంటరిగా వర్ధన్నపేటలో ఉంటూ కొన్నేళ్ల క్రితం ఓ బాలుడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. వారం క్రితం విజయ అస్వస్థతకు గురికాగా దత్తపుత్రుడు ఆమెను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. మొదట ఆమెను అక్కాచెల్లెళ్లు తీసుకెళ్లారు. కానీ జ్వరం తగ్గకపోవడంతో కరోనా సోకిందనే అనుమానంతో వర్ధన్నపేటలోని ఇంట్లో వదిలేశారు. అప్పటి నుంచి ఆమె లేవలేని స్థితిలో తిండి, నీరు లేక నీరసించింది.

గురువారం ఆమె స్థితిని గమనించిన ఇరుగుపొరుగువారు ఆమె భర్తకు ఫోన్‌ చేయగా తాను కరోనా బారిన పడినందున మీరే ఆస్పత్రిలో చేర్చాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక మునిసిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా  పట్టించుకోలేదు. ఇక స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు చెబితే హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌చేస్తే తప్ప తాము తీసుకెళ్లలేమని చేతులెత్తేశారు. స్థానిక యువకులు మంచినీరు, ఆహారం ఇవ్వాలని ప్రయత్నిం చారు. ఆమె నీళ్లూ తాగలేని పరిస్థితిలో ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top