అంగన్‌వాడీల్లో కొలువుల భర్తీ! | Officials are busy filling vacancies for teachers and helpers in Anganwadi centers. | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో కొలువుల భర్తీ!

Jan 9 2025 4:29 AM | Updated on Jan 9 2025 4:29 AM

Officials are busy filling vacancies for teachers and helpers in Anganwadi centers.

టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు 

క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 

ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని సమర్పించాలని సీడీపీఓలకు ఆదేశం 

ఈ ఏడాది పదవీ విరమణ పొందేవారి లెక్కలపైనా ఆరా 

పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలకు ఉపక్రమించింది. పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్యను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీలు, రిటైర్మెంట్ల వివరాల సేకరణ చేపట్టింది. లెక్కలపై స్పష్టత వచ్చాక భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. 

పనిచేస్తున్నది ఎందరు.. ఖాళీలెన్ని? 
రాష్ట్రంలో 149 సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. వీటన్నింటిలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌ తాజాగా క్షేత్రస్థాయిలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారు(సీడీపీఓ)లను ఆదేశించింది.

ఆయా ప్రాజెక్టుల వారీగా వివరాలను సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ల వివరాలు, ఖాళీలు, సెంటర్‌లోని రిజర్వేషన్లు, ఈ ఏడాదిలో పదవీ విరమణ పొందుతున్న వారు, ఇప్పటికే పదవీ విరమణకు అర్హత సాధించి విధుల్లో కొనసాగుతున్న వారి వివరాలన్నీ సమర్పించాలని ఆదేశించింది.

ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం జిల్లా సంక్షేమాధికారులకు చేరగా.. త్వరలో కమిషనరేట్‌కు సమరి్పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఖాళీల లెక్కలు తేలితే.. అక్కడున్న రిజర్వేషన్లకు అనుగుణంగా టీచర్, హెల్పర్‌ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,800 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్‌ ఖాళీలు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

మినీ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌తో.. 
రాష్ట్రంలో 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఒక హెల్పర్‌ పనిచేస్తుంటే... మినీ అంగన్‌వాడీ కేంద్రంలో ఒక టీచర్‌ మాత్రమే ఉంటారు. 

ఈ మినీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేశాక హెల్పర్‌ పోస్టు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ పోస్టుల లెక్కలు తేలలేదు. అప్‌గ్రెడేషన్‌ ప్రక్రియ పూర్తయితే మొత్తంగా హెల్పర్‌ పోస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

రిటైర్మెంట్ల వివరాలపైనా..
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణకు సంబంధించిన ప్యాకేజీ పెంచనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు సందర్భాల్లో వెల్లడించారు. ఆ ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనితో గడువు తీరినా చాలా మంది పదవీ విరమణ తీసుకోలేదు. ఈ క్రమంలో పదవీ విరమణ పొందాల్సినవారి వివరాలను కూడా సమర్పించాలని, ఇప్పటికే రిటైర్‌ అయినవారి వివరాలను అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement