
7 వరకు రిజిస్ట్రేషన్లకు గడువు
బీ, సీ కేటగిరీల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ల ద్వారానే సీట్లు
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేట్ నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీలతోపాటు అనురాగ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నీలిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 7 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. అభ్యర్థులు నీట్–యూజీ 2025లో అర్హత సాధించి ఉండాలి. జనరల్ కేటగిరికి చెందిన విద్యార్థులకు 50వ పర్సంటైల్‌లో కనీసం 144 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 40వ పర్సంటైల్‌లో 113 మార్కులు, ఓసీ పీడబ్ల్యూడీ వర్గానికి 45వ పర్సంటైల్‌లో 127 మార్కులు కనీస అర్హతగా వర్సిటీ పేర్కొంది.
కన్వినర్ కోటా 50 శాతం పోగా మిగిలిన సీట్లలో...
ప్రైవేటు నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కళాశాల్లో 50 శాతం కన్వీనర్ కోటా పోగా మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో బీ కేటగిరీ కింద కేటాయిస్తారు. బీ కేటగిరి సీట్లలో కూడా 85 శాతం స్థానిక అభ్యర్థులకు రిజర్వు చేశారు. మిగిలిన 15 శాతం సీట్లు దేశవ్యాప్తంగా అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. నీలిమా కళాశాలలో బీ కేటగిరిలో 25 శాతం మాత్రమే స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మైనారిటీ కాలేజీల్లో సీట్లు ముస్లిం అభ్యర్థులకే ఇవ్వనున్నారు.
చివరి దశలో అర్హులు లేకపోతే 30 శాతం వరకు నాన్ మైనారిటీ అభ్యర్థులకు కేటాయించవచ్చు. గడువు తర్వాత తాత్కాలిక మెరిట్ జాబితా తయారు చేసి తర్వాత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ప్రవేశానికి సంబంధించి పూర్తి వివరాలనుknruhs.telangana.gov.in వెబ్‌సైట్ లో పొందుపరిచారు. కన్వినర్ కోటా కౌన్సెలింగ్ తరువాత మేనేజ్‌మెంట్ కోటాలో బీ, సీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది.
