మహబూబ్ నగర్ జిల్లా: మండలంలోని రాళ్లగడ్డ తండాలో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలన్నర రోజులకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. గొల్లపల్లి శివారులోని రాళ్లగడ్డ తండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన చర్చిత (23) ఖమ్మంలో బీఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు.
45 రోజుల క్రితం ఆమె తన తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తలు ప్రస్తుతం రాళ్లగడ్డ తండాలో ఉంటున్నారు. ఆదివారం భర్త పవన్‌కుమార్ డ్యూటీకి వెళ్లి వచ్చి తండాలోని స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో చర్చిత ఇంట్లో ఒంటరిగా ఉంది. కొద్ది సేపటికే ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలు ఎంఫార్మసీ పరీక్షలకు హాజరవుతుందని.. భర్త, ఇతర కుటుంబ సభ్యులతో అన్యూన్యంగా ఉంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
