సరికొత్త ట్రావెల్ ట్రెండ్.. రూమ్ రాటింగ్
సైట్ సీయింగ్ కష్టం.. సేద తీరడమే ఇష్టం అంటున్న జెన్‌జీ
ఎక్కువ సమయం గదిలో గడిపేందుకే మొగ్గు
ఒత్తిడితో కూడిన జీవితం, బిజీ షెడ్యూల్ ఫలితం
వెల్లడిస్తున్న తాజా అధ్యయనాలు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా టూర్ వెళుతున్నాం అంటే ముందస్తుగా అక్కడ మనం చూడాల్సిన ప్రదేశాల జాబితా మన జేబులో చేరుతుంది. చారిత్రక కట్టడాలు, జలపా తాలు, బీచ్‌లు, ప్రసిద్ధ రెస్టారెంట్లు చుట్టేయాలి.. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలను కవర్ చేయాలి. సర్వసాధారణ పర్యా టకుడి ఆలోచన ఇదే. కానీ జెన్ జీ మాత్రం ఈ సంప్రదాయాన్ని మార్చేస్తోంది. కొత్త ప్రదేశానికి వెళ్లి రోజంతా తిరగడం కాకుండా.. హోటల్ లేదా రిసార్ట్ గదిలోనే ఎక్కువ సమయం విశ్రాంతిగా గడపడం ఇప్పుడు సరికొత్త ట్రావెల్ ట్రెండ్‌గా మారింది. దీనినే ‘రూమ్ రాటింగ్’గా పర్యాటక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
రూమ్ రాటింగ్ అంటే..
సెలవు కోసం ఎక్కడికైనా వెళ్లి, అక్కడి ప్రధాన పర్యాటక ప్రదేశాలను చూసేందుకు పరుగులు పెట్టకుండా.. తమ హోటల్ గది, రిసార్ట్ లేదా వెకేషన్ హోమ్‌లోనే ఎక్కువ సమయం గడపడం అనే ఆలోచననే రూమ్ రాటింగ్ అని చెప్పొచ్చు. గదిలో ఉంటూ సినిమా లేదా వెబ్ సిరీస్ చూడటం, నచ్చిన పుస్తకం చదవడం, లేదా నిద్రపోవడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, బాల్కనీలో కూర్చుని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడం.. ఇలా తిరుగుడు తగ్గించి ప్రశాంతంగా ఉండటమే రూమ్ రాటింగ్.
ఎయిర్‌బిఎన్‌బి, యుగొవ్‌ల అధ్యయనం
దేశ జెన్‌జీ ట్రావెల్ ట్రెండ్స్‌పై ఎయిర్‌బిఎన్‌బి, యుగొవ్‌ల తాజా అధ్యయనం ఈ సరికొత్త అంశాలను వెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం.. 18–29 ఏళ్ల వయసు ప్రయాణికుల్లో మూడింట రెండొంతుల మంది విశ్రాంతి తీసుకోవడానికే పర్యాటక ప్రదేశాలకు వెళుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. వీరు తమ ప్రయాణంలో కనీసం సగం సమయాన్ని వారు బస చేసే ప్రదేశంలోనే గడుపుతున్నట్లు తేల్చింది. అధ్యయనం ప్రకారం 64 శాతం మంది తమ ప్రయాణ షెడ్యూల్‌లో కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగానే ఖాళీగా ఉంచుతున్నారు. 74 శాతం మంది తమకు గుర్తుండిపోయే ప్రయాణ అనుభవాలు తరచూ ముందుగా ప్లాన్ చేయనివేనని చెప్పారు.
బిజీ షెడ్యూల్ వద్దే వద్దు..
వెకేషన్‌కి వెళ్లి ఉదయం 6 గంటలకే నిద్ర లేవడం, 7 గంటలకు ఒక ప్లేస్, 9 గంటలకు మరొకటి, సాయంత్రం మరో మూడు ప్రదేశాలు.. ఇలాంటి బిజీ షెడ్యూల్‌ను జెన్‌జీ ఇష్టపడడం లేదని స్టడీలో స్పష్టంగా వెల్లడైంది. తమకు నచ్చిన సమయంలో నిద్ర లేవడం, ప్లాన్ లేకుండా బయటకు వెళ్లడం/బస చేసిన ప్రదేశం చుట్టుపక్కలే సంచరించడం.. వంటి ఫ్లెక్సిబుల్ ట్రావెల్ వైపు యువత మొగ్గు చూపుతోంది.
డెస్టినేషన్ కాదు..‘స్టే’కేషన్
ఇక్కడ మరో ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ‘ఎక్కడికి వెళ్తున్నాం?’ అనేది ముఖ్యమైతే.. ఇప్పుడు ‘ఎక్కడ ఉంటున్నాం?’ అనేది కూడా అంతే ముఖ్యంగా మారుతోంది. తత్ఫలితంగా...చక్కటి వ్యూ ఉన్న గది, బాల్కనీ, అందమైన ఇంటీరియర్, కిచెన్, పూల్, విశాలమైన లివింగ్ ఏరియాలతో ప్రకృతి మధ్యలో ఉన్న హోమ్‌స్టేలకు డిమాండ్ పెరుగుతోంది. అధ్యయనం ప్రకారం 82 శాతం మందికి ప్రయాణ ప్రణాళికలో వసతి చాలా ముఖ్యమైన అంశంగా ఉంటే, 63 శాతం యువ పర్యాటకులు తాము ఎంచుకున్న బస కారణంగానే గమ్యస్థానాన్ని ఎంపిక చేసినట్లు చెప్పడం విశేషం.
టు డూ లిస్ట్... నాట్ మస్ట్
తాము పనిచేసే, స్థిర నివాసం ఉండే ప్రదేశాల్లోని ఒత్తిడితో కూడిన జీవితం, బిజీ షెడ్యూల్‌లే రూమ్ రాటింగ్ ఊపందుకోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలతో పాటు నగర జీవితంలోని నిరంతర కమ్యూనికేషన్ వల్ల వీకెండ్స్‌లోనూ విశ్రాంతి కరువవుతున్న పరిస్థితి ఉంది. దీంతో కొంత సమయం పూర్తిగా రిలాక్స్ కావాలనేది యువత ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే పర్యాటక ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ‘టు–డూ లిస్ట్’ పెట్టుకోవడం అనేది రాను రాను ప్రాధాన్యత కోల్పోతోంది.


