
ఆధునిక కోర్సులకు ఫ్యాకల్టీ కొరత
ఇప్పటికిప్పుడు అర్హులు దొరకని పరిస్థితి
ఉన్నవారికే శిక్షణ ఇవ్వాలని ఏఐసీటీఈ సూచన
ఐఐటీ, ఎన్‌ఐటీలతో సమన్వయం
సాఫ్ట్‌వేర్ నిపుణులతోనూ వీకెండ్ క్లాసులు
రాష్ట్రాలకు ఏఐసీటీఈ మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎమర్జింగ్ కోర్సుల బోధనకు ఆధునిక మెళకువలు అవసరమని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సూచించింది. ప్రస్తుతం ఉన్న ఫ్యాకల్టీకే శిక్షణ ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తెలిపింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను జారీచేసింది. ఇంజనీరింగ్‌లో కొన్నేళ్లుగా కోర్ గ్రూపులకన్నా, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీలకు డిమాండ్ ఎక్కువైంది.
అయితే, ఈ కోర్సుల బోధనకు సరైన ఫ్యాకల్టీ ఉండటం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇవి కొత్తగా వచ్చిన కోర్సులు కావడంతో ఇందులో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు ఉండటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బోధించే వారితోనే కొత్త కోర్సులూ చెప్పిస్తున్నారు. ఇంకో మూడేళ్లపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బోధకులకే శిక్షణ ఇచ్చి కొత్త కోర్సులు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని ఏఐసీటీఈ సూచించింది.
శిక్షణ తప్పనిసరి
రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో సగానికిపైగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. సీఎస్‌ఈ కోర్ కాకుండా ఏఐ, ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సీట్లు 15 వేల వరకు ఉన్నాయి. ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక నిపుణుడైన బోధకుడు ఉండాలి. దీంతో ఫ్యాకల్టీ కొరత ఏర్పడింది. వాస్తవానికి కొత్త కోర్సులకు అదనంగా ఆరు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఇందులో కూడా బేసిక్ చాప్టర్లు సీఎస్‌ఈ కోర్సులో ఉన్నవే.
అదనపు చాప్టర్లు కొత్తగా వస్తున్న ఏఐ, డేటా అనాలిసిస్, సైబర్ లాంగ్వేజ్ సిస్టమ్‌కు సంబంధించినవి. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో కొత్త కోర్సులతోపాటు, ఆధునిక సాంకేతికతపై ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సంస్థలతో ఓరియంటేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి ఫ్యాకల్టీ అప్‌డేట్ అయ్యింది. రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్‌ఈతోపాటు ఎలక్ట్రానిక్స్ బోధిస్తున్న అధ్యాపకులను ఎన్‌ఐటీ, ఐఐటీల్లో కొంతకాలం శిక్షణకు పంపడం లేదా ఆన్‌లైన్ శిక్షణ ఇప్పించాలని ఏఐసీటీఈ సూచించింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతోనూ శిక్షణ
ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న ఐటీ ఉద్యోగులు కంపెనీల శిక్షణతో వృత్తిపరమైన ఉన్నతి పొందుతున్నారు. నాలుగేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు సబ్జెక్టుపై మంచి అవగాహన ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ ఉద్యోగులతో ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులకు శిక్షణ ఇప్పించాలని ఏఐసీటీఈ సూచించింది. ఐటీ ఉద్యోగులకు సాధారణంగా శని, ఆదివారాల్లో సెలవులు ఉంటాయి. ఈ రెండు రోజులు అధ్యాపకులకు క్లాసులు నిర్వహించవచ్చని తెలిపింది.
దీంతోపాటు ఆన్‌లైన్‌లో నిర్వహించే ఏఐ కోర్సుల ద్వారా కూడా ఫ్యాకల్టీని అప్‌గ్రేడ్ చేయవచ్చని పేర్కొంది. ఇలా శిక్షణ పొందిన ఫ్యాకల్టీకి ప్రతి సంవత్సరం ఏఐసీటీఈ నేతృత్వంలో పరీక్ష నిర్వహించే ఆలోచనపై కూడా కసరత్తు జరుగుతోంది. దీంతో అధ్యాపకుడు ఆయా రంగంలో నిష్ణాతుడన్న ధ్రువీకరణ జరుగుతుంది. ఫ్యాకల్టీ లేని కారణంగా సీట్ల పెంపు ఆపేకన్నా, ఉన్నవారిని మెరుగుపర్చుకోవడం సులభమన్న విధానాన్ని ఏఐసీటీఈ రాష్ట్రాల ముందు ఉంచింది.