New Road Way To Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా..

New Road Shamshabad Airport Pedda Golkonda Outer Junction To Gollapalli - Sakshi

పెద్దగోల్కొండ ఔటర్‌ జంక్షన్‌ టు గొల్లపల్లి మీదుగా... 

శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు రానున్న ప్రధాని  

మోదీ రాకను పురస్కరించుకుని రహదారి విస్తరణ 

శంషాబాద్‌ రూరల్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్‌ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

శంషాబాద్‌ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి నుంచి తుక్కుగూడ సమీపంలోంచి మరో దారి ఇది వరకే ఉండగా.. ప్రస్తుతం గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండలోని ఔటర్‌ రోటరీ జంక్షన్‌ను అనుసంధానం చేస్తూ కొత్తగా రహదారిని విస్తరిస్తున్నారు. విమానాశ్రయం రెండో దశ విస్తరణలో భాగంగా  ఎయిర్‌పోర్టు ఆవరణలో కార్గో వాహనాల కోసం నాలుగు వరసల రహదారి ఏర్పాటు చేశారు.

ఈ రహదారి ముఖ్యంగా కార్గో టెర్మినల్‌ నుంచి సరుకుల వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది వరకు ఉన్న ఎయిర్‌పోర్టు మార్గాలో విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. కొత్తగా ఏర్పాటు చేసిన మార్గంలో కార్గో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కార్గో వాహనాలు ఔటర్‌ మీదుగా పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్‌ నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. 
(చదవండి: ‘సహకార’ అప్పు.. దాడుల ముప్పు!)

రూ.6 కోట్లతో విస్తరణ పనులు.. 
ఎయిర్‌పోర్టు లోపల నుంచి కార్గో వాహనాల కోసం గొల్లపల్లి శివారు వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణం ఇది వరకే పూర్తి చేశారు. శంషాబాద్‌ నుంచి గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండ ఔటర్‌ జంక్షన్‌ వరకు ఉన్న రహదారితో ఎయిర్‌పోర్టు రోడ్డును గొల్లపల్లి వద్ద అనుసంధానం చేస్తున్నారు. దీంతో గొల్లపల్లి నుంచి పెద్దగోల్కొండ జంక్షన్‌ వరకు ఉన్న దారిని సుమారు రూ.6 కోట్లతో విస్తరిస్తున్నారు. 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ దారిని ప్రస్తుతం 10 మీటర్లకు విస్తరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ప్రధాని రోడ్డు మార్గం ఇలా.. 
శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరానికి రోడ్డు మార్గంలో చేరుకోవడానికి గొల్లపల్లి నుంచి ఔటర్‌ జంక్షన్‌ మీదుగా పీ– వన్‌ రోడ్డు మీదుగా చేరుకుంటారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంగా ఈ రహదారిని నిర్ణయించడంతో ఈ మార్గంలో మొక్కలు, అందమైన పూల మొక్కలను నాటుతున్నారు. పెద్దగోల్కొండ ఔటర్‌ జంక్షన్‌ వద్ద రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మార్గంలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. 
(చదవండి: జంక్షన్‌’లోనే లైఫ్‌ ‘టర్న్‌’)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top